పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

హేమలత

వివాహమాడి యిల్లు నిలువబెట్టి కొమ్ము. నీ మనో నాయకి యగు హేమలత యున్నచో నామెను జేకొనుము” అని పలుక నామాట అమృత సేచనమట్లు మదనసింగున కపార సౌఖ్యమును గలిగించెను, కాని హేమలత యెందును గాన రానందున నతఁడు దీర్ఘ విచారమగ్నుఁడయి యానాడుదయమున చిదానంద యోగి మఠమున కరిగెను. కుమారసింగా తొలినాడే మఠమును బాసి చనినట్టు చిదానంద యోగి యెఱిఁగింప మదన సింగు హేమలత జాడలు తెలియనందులకు విచారించుచు నింటికి వచ్చుచుండెను. అప్పుడు రాజవీధిలో నొకపల్లకి యాతని కంటబడెను. ఆ పల్లకి వెంటవచ్చుచున్న యేఁబది వత్సరముల ప్రాయముగల యొకతురక మదనసింగును “మదనసింగుగారూ! నిలువుఁడీ” యని పిలువ నతఁడును నిలిచిచూచి యామనుష్యు నానవాలు పట్టి పేరు స్ఫురణకు రానందున జ్ఞప్తికిఁ దెచ్చికొను చుండెను. అంతట నాతురక సింగుతో “అయ్యా! మీరు నన్ను గుర్తింపఁ జాలరు. నాది పారీ గ్రామము, నా పేరబ్దుల్ ఖరీము మౌలవి. పల్లకిలో నున్న యతఁడు ముసలినారాయణసింగు. ఇతనిని మీరాదరింపుఁడు అన సంతోషముతోఁ బల్లకినింటికిఁ దోడ్కొని పోయి నారాయణసింగును సగౌరవమున నాదరించి హేమలత కై యాతడు వెదకుటవిని చిత్తూరునందామె లేదని చెప్పి “మీరు పాలిగ్రామమునుండి యిటకెట్లు వచ్చిరో మాకుఁ దెలియఁ జేయుఁడి” యని మదనసింగడిగెను. రహిమానుఖాను దౌర్జన్యమును, దాను జెఱసాలయందుండుటయు, రహమానునకు బదులుగ వచ్చినవాఁడు తన్ను హింసించుటయు, వేటకుఁబోయినప్పుడొక వ్యాఘ్రము వానిపైఁ బడి