పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

హేమలత

నన్ను నీ వేవిషయమునను బ్రశ్నలు వైచి బాధ పెట్టకుము. ఱేపు నా సంగతి చెప్పి మా చెల్లెలి సంగతి గూడ బయలు పఱచెదను, అని పలుక మదనసింగూర కుండెను. అతనిమనమున నాందోళన మధికమయ్యెను. వారి రువురును గొంత సేపు నడచి నగరమును సమీపించునప్పుడు వారికి జిదానంద యోగి కనబడెను. యోగిని జూచి కుమారసింగు వినయముతో నమస్కరించి చేతులు జోడించి నిలువ యోగి వాని నాశీర్వదించి యానవాలు పట్టి తన బసకు రమ్మని బలవంతము చేసెను. కుమారసింగు మదనసింగు వొద్ద సెలవుగై కొని యారాత్రి యోగితో నరిగెను, మదనసింగుమాత్రము కుమారసింగు మాటలయం దర్థము నరయుచు నాతని ముఖవిలాసమునం దొకయాకర్షణముండుటచే ధ్యాన్య మావైపుంచి యింటి కరిగెను. కుమార సింగారాత్రి చిదానందయోగి మఠమున భుజియించి సుఖముగా నిద్రించెను. మదనసింగింటి కరుగునప్పటికిఁ గృష్ణసింగు రోదనముచేయుచు బ్రతాపసింగు గాయములచే మరణావశిష్టుడై రాజమందిరమున నుండెననియు, సువర్ణ బాయి యటకరిగెననియు జెప్పి యాతని నటకు బొమ్మనెను. ఆ మాటలు విని మదనసింగు దుఃఖభారముచే నడువజాలక కన్నీళ్ళు విడుచుచు మెల్లమెల్లగా రాజాంతఃపురము బ్రవేశించెను. భీమసింగు, మహారాణాలక్ష్మణసింగు, గోరా సింగు మొదలగు వారందఱు మదనసింగున కెదురు వచ్చి శత్రుజయమున కాతని బహుకరించి పినతండ్రి యొద్దకు దోడ్కొని పోయిరి. జయ సంతోషమును బితృమరణదుఃఖమును నేక కాలమున సింగుహృదయమున జనియింప నాతఁడు లోపలి కరిగి గాయములచే బాధపడుచు ధైర్యమును విడువ పినతండ్రినిం జూచి దుఃఖమును బట్టజాలక యాతనిపై బడి యేడ్వ