పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

హేమలత

మాకు లిప్పించి తగినవారి సుపచారమునకు నియమించి మదనసింగు ప్రొద్దు జూచి రెండు జాము లైనదని తెలిసికొని గృహాభిముఖుడై యరుగుచుండ నతని వెనుక నొక మనుష్య విగ్రహము వచ్చి వీపుపైఁ జేయివైచి యాకస్మికముగ నతని నాపెను. మదనసింగులికిపడి తిరిగి చూచి తన యెదుటఁ బదియాఱువత్సరముల ప్రాయముగల యొక బాలకునిఁ జూచి యాశ్చర్యపడి నీవెవ్వడ వని యడిగెను. నా పేరు కుమారసింగు. నేను రాజపుత్రుఁడను అని యాతఁడుత్తరమిచ్చెను. అంతట వారిట్లు మాటాడిరి.

మద – నీవీరాత్రి యెందుండి యిటు వచ్చు చున్నావు? నీ చరిత్రమును గొంత చెప్పుము.

కుమా – అయ్యా! నేనీవఱకు జక్రవర్తి కొలువున నుంటిని. పాలిగ్రామమున నున్న నారాయణసింగు మాతాత. హేమలత నా చెల్లెలు. మేము చాలాకాలము క్రిందట వియోగము నొందినాము. మాతండ్రి నా చిన్నతనమునందే మృతినొందెను.

మద – అహాహా! నీమాట లాశ్చర్యమును గల్గించుచున్నవి. హేమలతకు నన్న యుండుట నేనిప్పుడు విన్నాను. ఆహా! నీ మొగ మచ్చముగ నామె మొగమువలెనే యున్నది. హేమలత యిప్పుడెందున్నది? ఆమెనుజూచి చాలాకాలమైనది, మీ తాత యేమయ్యెను?

కుమా – మా హేమలతా? ఆమెయు నీ శిబిరముతో వచ్చినది, కాని యీ యల్లరిలో నెటకో పోయి యుండును. ఆమె దొరకుట దుర్లభమని నాకు దోచుచున్నది.