పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

ఇట్లు సమస్తసైన్యమును శత్రువులచే వధింపఁబడుటయుఁ దనకపారకష్టము సంభవించుటయుఁ బద్మినీ దేవి చేకూరకుండుటయుఁజూచి చక్రవర్తి రణరంగము విడిచి సత్వరముగ భద్రగజముపై నెక్కి తన కాపత్కాలమున సహాయ మొనర్చిన నాజరుజంగును వేనోళ్ళ నుతియించుచు నాతనిఁగూడ నేనుఁగుపై నెక్కించుకొని దీనుండయి ఢిల్లీ నగరమునకుఁ బ్రయాణమయ్యెను. శిబిరముననుసరించి వచ్చిన స్త్రీజనమెల్ల నాక్రందన ధ్వనులతోఁ బరుగెత్తనారంభించినపుడు వారివారి భర్తలు వారికి సహాయముగఁబోయి వారి కపాయము వాటిల్లకుండఁగఁ జేసిరి. చంద్రసేనుఁడు యుద్ధము జరుగుచున్నంత వఱకును రంగస్థలమును బాసిచనక చక్రవర్తి సైన్యములు పఱచిన వెనుక జయాశవీడి శిబిరమునకుఁ జని భార్యను గనుఁ గొని హేమలతతో గూడ బ్రయాణమై వెడలుమని యానతిచ్చెను. హేమలత వారి గుడారమున లేదని భార్యయెఱిఁగింపఁ గొంతసేపు చంద్రసేనుఁడు బాలిక కొఱకు వెదకి యామెను గన లేత తుదకు విసిగి హేమలతను మహమ్మదీయులో, శత్రువులలో నెవరో తీసికొని పోయి యుందురని నిశ్చయించి కొంచెము విచారించి తనరాజు వెంటఁ దానరిగెను. మదనసింగు పినతండ్రియవస్థ యెట్లున్నదో యని త్వరితగతి నావంకకు వచ్చెనుగాని యానడుమనే భీమసింగు ప్రతాపసింగు నిమిత్తము మనుష్యుల నంపి వెదకి యాతనిఁ దోడ్కొని రమ్మని వారికానతిచ్చినందునఁ గాయము నిండ గాయములతో నున్న యమ్మహాశూరశిఖామణిని వారు భీమసింగుగారి