పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

హేమలత

నకు రాకుండిన జక్రవర్తి యా దినమునఁ బరలోక వాసియై యుండును. చక్రవర్తి మదనసింగును జూచి నిర్విణ్ణుడై చేష్టలుదక్కి కదలి పాఱిపోజాల డయ్యెను. అప్పుడు నాజరుజంగు మదనసింగునితో నిట్లనియె.

“మిత్రుడా! నాఁటికి నేఁడు నీ దర్శనమైనదని నేనూరకుండను. నా ప్రాణములుండినంత వఱకు నీవు చక్రవర్తిపై పఱగజాలవు. అక్కడనే నిలువుము. ఒక్క యడుగు దాటివచ్చితివా నీ ప్రాణములు నీకు దక్కవు. మా స్వామి ప్రాణరక్షముకంటె నారక్షణ మెక్కువకాదు” అని శౌర్యరసమొల్కు రాజభక్తి ప్రపూరము లగుమాటలతో మదనసింగును నిలుప, నత డాశ్చర్యపడి, చక్రవర్తి యదృష్టవంతుడగుటచే నీవాతనికి నేఁ డడ్డము వచ్చినావు. నీతో యుద్ధము చేసి గెలిచి చక్రవర్తిని బరిమార్చెదను అని పలికి యాతనితో యుద్ధమారంభించెను. అట్లిరువురును గొంత సేపు యుద్ధము సలిపి యెవ్వరును గెలువనందున విసుగుచుండిరి. అంతలో యుద్ధమాఁపి వేయుమని భీమసింగు ఉత్తరువుజేయ మదనసింగు మరలెను.

ఆ దినమున రాజపుత్రవీరు లనేకులు మృతినొందినను దుదకు మహమ్మదీయులు చెల్లాచెదరై నానాముఖములకు బాఱిపోయిరి. ఈ నడుమ మన చిదానందయోగి కాగడాలను వేయించుకొనివచ్చి నూరుగురు భటులతో రంగస్థలము జొచ్చి తురకల గడ్డములను దివిటీలతో గాల్చుచు వారి వస్త్రములను శరీరములను దహన మొనర్చుచు జిత్రవిచిత్రముగ వారిని జంపనారంభించెను. మహమ్మదీయు లప్పటికి నిశ్శేషముగ నోడింపబడిరి. సరదారులు, చచ్చిన గుఱ్ఱము లొక వైపరుగ నేనుగులు మఱియొక వంకకు జనసాగెను.