పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

127

స్త్రీలందఱ నిటకు వచ్చి సాగనంపెదరు. వారేడు వందలకంటే నెక్కువ గనున్నారు. అందఱు బల్లకీలలో నెక్కివత్తురు. వారు ఘోషాస్త్రీలుకాఁబట్టి వారికి బ్రత్యేకముగ నొకగుడారమునిచ్చి మహమ్మదీయుల దృష్టి బడకుండ మీరు జాగ్రత్త పెట్టవలెను. అనవుడు చక్రవర్తి సందేహమెందుకు? మిగుల జాగ్రత పెట్టెదను. త్వరగా రమ్మను త్వరగా రమ్మను. పో పో యని కేకలు వేయసాగెను. ఇట్లు చెప్పి దుర్గసింగు చక్రవర్తి వీడుకొని పోవునపుడు చక్రవర్తి రసపుత్రునకు దన కంఠమున నున్నహారమును బహుమానముగ నొసగెను. ఈ రాజపుత్రు డరిగినది మొదలు చక్రవర్తి బద్మినిపై ధ్యానమెక్కువగుటచే నతడు తీవ్రముగ మదనాగ్ని పాలయ్యెను. ఒకమారు సంతోషముచే వెర్రి వానివలె నఱచుచు, నొక పర్యాయము సేవకులకు బహుమానము లిచ్చుచు నొకమారు తోచక గుఱ్ఱముపై సవారి చేయుచు మదనావస్థ నొందుచుండెను. పద్మిని ప్రముఖులగు రాజపుత్ర సుందరు లబలగుటచే నాయుధపాణులగు భటులను జూచి భయపడుచుందురని చక్రవర్తి నిరాయుధులై యుండునట్లు సైనికుల కానతివచ్చెను. వారును నాయుధములను వదలి బంగు నిషాచేయ హాయిగ నిద్రపోవుచుండిరి. మదన పీడితుడగు నతనికి నెంతసేపటికి బ్రొద్దువోనందున దన ఖాజీని రహిమాన్ ఖానుని రప్పించి వారితో గొంతసేపు దనకు రాబోవు నూతనభార్యను గూర్చి పరిపరివిధముల ముచ్చటించుచుండెను. అట్లు కొంతసేపు ముచ్చటించి తన పెండ్లి నిశ్చయమని యెంచి తాను శయనించు మందిరమును జక్కగ నలంకరింప నాజ్ఞాపించి యమూల్య వస్త్రాభరణములను ధరించెను. దుర్గసింగు దెచ్చిన రాయబారమును వినియుండుటచే జక్రవర్తి హేమలత మాట మఱచియుండ మధ్యాహ్నము చంద్రసేనుడే ప్రభుదర్శనమునకు వచ్చి