పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెఱిగించెను. రహిమాను ఖానుయొక్క దౌర్జన్యమునకు జక్రవర్తి మండిపడి చంద్రసేనుని బంపి ఖానుని బిలిపించి కఠినముగ నాతని మందలించెను. అంతట దనమీద నేరము దప్పించుకొనుటకు ఖాను ఉపాయమును వెదకి తుదక పన్నుగడ నూహించి యేలికతో నిట్లు విన్నవించెను. “మహాప్రభూ! అతని వద్దనున్న బాలిక నిజముగ నప్సరస, పద్మినివలె నుండును. పద్మిని కామె బంధువని విని యామె నెట్లయిన దమకు సమర్పింపవలెనని చంద్రసేనుని నేనడిగితిని గాని యాకన్య నా నిమిత్తముకాదు” అని విన్నవించిన ఖాను మాటలచే మదన వికారముదయింప ఖానుపై దయజూపి యంపి తక్షణమే చంద్రసేనుని రప్పించి హేమలతను దన శిబిరమునకు దీసికొని రావలయునని యానతిచ్చెను. ఆ మాటలు విని చంద్రసేనుడు నిర్విణ్ణుడై యది రహిమానుఖాను మాయగా దెలిసికొని చక్రవర్తి సమ్ముఖమున మాఱుమాటాడ లేక సరేయని వెడలెను. మార్గమున బోవుచు దానింత కాలము దిక్కులేని రాచకన్నియ మర్యాద గాపాడి తుదకు నిర్దయాత్ముడయిన మహమ్మదీయ చక్రవర్తి కప్పగింపవలసివచ్చెనని విచారమునొందుచు గుడారమునకు వచ్చి యతడావార్త దనయింతికిని హేమలతకును దెలయజేసెను. హేమలత యవ్వచనము లాలకించి సకల దీనులకును న్యాయమొసగి స్త్రీల జెఱబట్టు దురాత్ముల శిక్షింపవలసిన చక్రవర్తియే స్త్రీల జెఱపదలంచినపుడు తన మర్యాద నిల్చుట దుర్ఘటమని నిశ్చయముగ నమ్ముకొని దైవముపై భారము వైచి యెంతెంత వారి నాశ్రయించిన నెన్ని దినములకును దనకష్టముల కంతము సంభవింప దయ్యెనని యారాత్రియెల్ల విచారించుచుండెను.