పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

121

నీచకర్మము నొనర్చువా రనుకొంటివి కాబోలును! ఈ తుచ్ఛకర్మముల నొనర్చి జీవించుటకంటె మాకు శూరజన సులభమగు మరణమే మేలు. పరాక్రమవంతుడవేని యీదుర్భాషలుడిగి కత్తిగట్టి మాతో మగవాడవై పోరుము.” అని యనేక భంగుల నిందించుచున్న మదనసింగు మాటల కాశ్చర్యపడి చక్రవర్తి మేర మీఱిన కోపముతో “నీ దుర్మార్గునిజంపివేయుడు. వీని నాలుకనుగోసి యెఱ్ఱగా గాలిన యినుప కఱ్ఱలను వీనికన్నులలో జొప్పించి పిమ్మట దలదెగ వేయుడు.” అని రహిమానుఖానున కానతిచ్చి తక్షణమే యాగుడారమునుండి వెలుపలికి జని భీమసింగును జెఱవెట్టిన గుడారమున కరిగెను. కామపీడచే జక్రవర్తికి యుక్తాయుక్త జ్ఞానము నశించినందున నతడు భీమసింగు సమ్ముఖముగ కరిగి తనహృదయ పద్మమును బాయకుండిన పద్మిని సంయోగమున దనకు గూర్పవలసినదని యాతని వేడుకొనెను. కీచకుని మాటలు కలిగిన భీమసేనునివలె జక్రవర్తి మాటల కలిగి భీమసింగు రౌద్రరస మొల్క నిట్లనియె. “అపకీర్తితో జిరకాలము జీవించుటకంటె గీర్తితో మరణమునొందుట యుత్తమము రాజపుత్ర రక్తము నరములయందు బ్రవహించు నంతకాలమును, గంఠమున బ్రాణము లుండునంత కాలమును భీమసింగు మరణమునకు వెఱచి నైచ్యము కొడంబడునని స్వప్నమున నయిన నమ్మకుము. నాకు మరణము మాట వంటిదికాని భయకారణము కాదు. నాకుమరణము సంభవించినను సరే; రసపుత్ర వంశములు నిర్మూలమైనను సరే! నేనట్టి కార్య మొనర్పను,” అని ప్రత్యుత్తరమియ్యగా నా మ్లేచ్ఛ చక్రవర్తి భీమసింగు మదనసింగుల నిరువుర జంపివేయవలెనని సంకల్పించుకొనెను. అందుచేత మదనసింగును దక్షణమే యంతమొందింపవలదనియు మఱునాడు భీమసింగుతో గూడ