పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

హేమలత

సింగును జెఱబెట్టి గుడారమునకు జని యొక పీఠముపై నాసీనుడై యతనిని దనయెదుటకు దీసికొని రమ్మని యాజ్ఞాపించెను. భటు లట్లతని దోడితేర మదనసింగు తురుష్కుని కట్టెదుట నిర్భయముగా నిలిచి యుండెను. అతని ధైర్యసంపదకు దనలో చక్రవర్తి యచ్చెరువడి వానితో నిస్సందేహముగా నిట్లని చెప్ప దొడంగెను. “ఓయీ! కాఫరు! రాజపుత్రా! నీవు మాచేబడినావు. నీకు బ్రాణముల దక్కించుకొనవలెనని యున్న పక్షమున నాకార్యము జక్కజేయుము. పద్మినిని మాకు సమకూర్చునట్లు మీ భీమసింగునకు సలహా చెప్పి కార్యసాఫల్యము గావింపుము. అట్లయిన నీ ప్రాణ సంరక్షణ మొనర్చుటయెగాక భీమసింగును విడుచుటయు నీకనేక బిరుదులను బహుమానములను నొసగుటయుగూడ నగును. లేకున్న నీకు మరణ దండన విధించెదను. నీసుందరకాయమును నీపరాక్రమమును జూడ నాకు జాలి యగుచున్నది. నీవు మరణమును గోరెదవా, నీ ప్రాణములను రక్షించుకొన గోరెదవా?” యని చక్రవర్తి పలక మదససింగు మహాకోపోద్దీపితుడయి నేత్రద్వయము చింతనిప్పులవలె జేవురింప మొగ మెఱ్ఱబార బరవశుడై తాను మ్లేచ్ఛ సార్వభౌముని స్వాధీనము నందుండుటయు దనకు మరణము సంప్రాప్త మగుటయు మఱచి నిర్భయముగా నిట్లు పలికెను. “ఛీ! నీ దురాలాపముల నింక గట్టి పెట్టుము. నీవు పౌరుషవంతుడ వనియు మానాభిమానములు గల వాడవనియు నేననుకొంటిని గాని యింత నీచుడవని నేనెన్నడెఱుగను. నీకు భీమసింగు మహారాజు భార్య యగు మహాపతివ్రత పద్మిని కావలయునా? మేముత్తమ క్షత్రియవంశ సంభూతులముగాని కఱకు తురకలముగాము. మాకు మానాభిమానములే తల్లిదండ్రులు. ప్రాణముల దీసివేయుదునని నీవు బెదరించు మాత్రమున తుచ్ఛ ప్రాణములకు జడిసి