పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

11

నందు – మనచేత నీకార్యములఁ జేయించుచున్న రహిమాన్ నలాయుద్దీను చక్రవర్తికడ గొప్ప యుద్యోగమునందుండగా మనకు నెవరి భయమును గలుగదు. అతడు సుఖవంతుఁడగుగాక!

గులా – మొన్నటిరాత్రి స్త్రీలను దోఁచుకొన్నప్పుడు దొరికిన నగలలో నెన్నవవంతు మనము తీసికొనునట్లు ప్రభువుగా రేర్పఱచినారు?

నందు – ఎంతయిచ్చిన నంతే మనమును బుచ్చుకొందము.

గులా – అదిసరే. కాని యాదినమున మనుష్యులను నరికినట్లు నీవిదివఱకెప్పుడు నఱికియుండలేదు. ఒక దెబ్బకు రెండు తునకలుగదా! వహవ్వా! శహబాస్! అటువంటి యేటు మఱిదొరకదు.

నందు – అదియొక్క లెక్కా! నెలదినముల క్రిందటఁ బ్రయాగలో యాత్రార్థమరుగు దెంచిన యోఢ్రులను దోఁచుకొన్నప్పుడు దయాదాక్షిణ్యములు లేక స్త్రీలను శిశువులనుగూడ నఱికివేసినాను. నాడు నీవుచూడలేదా?

అని వీరిరువురు సంభాషించుకొనుచుండఁ బోతవిగ్రహమువలె నాలయ మధ్యమున సుఖాసీనుఁడైయున్న మనబాటసారి భయముచే గడగడవడంకుచు నేమియుఁ జేయలేకయుండెను. వారి సంభాషణమునుబట్టి వారు మనుష్య హంతకులని యతఁడు తెలిసికొనెను. వారిదివఱ కతనిని జూడక తమ రహస్యముల బయలుపఱచు కొనుచుండిరి. అపుడు నందుఁడు కొంచెము గంజాయి పీల్చవలెనని కోరి సంచిలో నున్న చెకుముకిరాతిని నినుపముక్కను దీసి వాని రాపిడిచే నగ్నిని సృజంచి చిలుములో గంజాయియాకును బొగాకునువైచి యందు నిప్పంటించి తాను నాలుగు గుక్కలను దాగి గులామున కందిచ్చెను. ఈ నిప్పు వెలుతురున గులాము మనుష్యుఁ