పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

113

కోటలోనున్న వారి దుఃఖమింతింతయని చెప్పనలవి కాదు. దుర్నిరీక్ష్య ప్రతాపుడగు భీమసింగును సూర్యుడు శాత్రవసైన్యమును పశ్చిమాంబుధి నడగిపోవుటచే నప్పుడప్పద్మినీ ముఖారవిందంబు వికాసహీనతనొందెను. నగరమున నాబాలగోపాలముగ జనులు భోజనములు మాని దుఃఖావేశముచే మాటలాడ జాలరైరి. కత్తివాటువైచిన నొకరిమొగమునను నెత్తుటి చుక్క లేకుండెను. కోటను, మేడలు నుద్యానవనములు, మందిరములు వెలవల బాఱుచు జిన్నవోయెను. సైనికులెల్ల నుస్సురుస్సురనుచు దిగులు నొందుచుండిరి. మదనసింగు తనబోటి సాహసికులు కొందఱితో జక్రవర్తి సైన్యముపై బోవ దలంచెనుగాని యాడపడుచుదనపు బ్రయత్నమును గోరాసింగు మాన్పెను. అనంతరము రాజపుత్రవీరులు నిజమందిరములకరిగి యారాత్రి కర్తవ్యమూహించు చుండిరి. ప్రతాపసింగును మదనసింగును విచారముతో నింటికిజనిరి. మదనసింగు దనప్రియురాలి సేమముగనుగొని తరువాత నొక కుర్చీమీద గూర్చుండినపుడు మెల్లగ సువర్ణబాయి వానికడకువచ్చి కూర్చుండి యిట్లని చెప్ప నారంభించెను. “నాయనా! నాదొక చిన్నమాట కలదు, నీకీబీద బాలికపై నెట్లు ప్రేమకుదిరెనో నేనెరుగుదును గాని యిది దౌర్భాగ్యురాలని తోచుచున్నది. మేలిముసుగు దీసిచూడ నిది నాకంత యందముగ గనపడలేదు. అందమట్లుండ దీనిదగ్గర దొంగతనముగూడనున్నది. ఈ దినమున నావజ్రపుటుంగరము పోయినది. అదితీసినట్లు దాసీజనులు చెప్పినారు. అది నీ ప్రియురాలగుటచే వారేమియు ననజాలకూరకుండిరి. అని తల్లి వచించిన మాటలు శూలములవడువున దనచెవులబడ మదనసింగు దుఃఖమునకు మితము లేకపోయెను. గాని తల్లి యబద్ధమెన్నడు దనతో బలుకదని తానెఱింగి యది సేవకులు చేసిన మాయ యనినమ్మి తల్లితో అమ్మా! హేమలతపయి నీకు