పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

హేమలత

అని చెప్పను. అంతటనామె చేయునదిలేక లాహిరిని జాగ్రత్తగ నుండుమని మెల్లగా యొకగదిని బ్రవేశించెను. ఆగదిలో నొక చిన్నదీపము మాత్రము గూకటిలో నుండుట బట్టి నిలిచియున్న మనుష్యుల మొగమును జూడజొచ్చెను. ఆగదిబ్రవేశించి రెండడుగులదూరమరిగి హేమలత యెదుట నతిదీర్ఘ కాయమును భయంకరమగు గడ్డమును దాల్చి ప్రత్యక్షయముని వలె నున్న రహిమానుఖాను విగ్రహము జూచెను. చూచి యకస్మికభయముచే శరీరము గజగజవడక నోట మాటరాక చేష్టలుదక్కి యెట్టకేలకు లాహిరీ! లాహిరీ యని భయాతిశయముచే నేలమూర్ఛిల్లెను. నేలబడుచున్న యామెను దనచేతులతో నిలిపి ప్రాణేశ్వరీ! భయపడకు. నేనుండగ నీకేమి భయములేదని రహిమానుఖానామె నాపబోయెను. కాని దుఃఖావేశముచే శరీర మెరుగని యామెను మొహావేశముచే శరీర మెరుగనిఖాను బట్టికొనలేకపోయెను. హేమలతపై ధ్యానము నిల్పియున్న లాహిరి ‘లాహిరి’ యను కేక తన చెవిని బడినతోడనే బాలిక కపాయ మేదో దటస్థమయినదని లేచి గడియ వేయ బడియున్న తలుపుదన్ని చేతులతో గుంజెను గాని యెవ్వరును దీయువారు లేరైరి. వెంటనే యిల్లువెడలి వీధిలోనికి వచ్చి యెలుగెత్తి అయ్యో అయ్యో! రక్షింపుడు. రక్షింపుడు అని కేకలు వేయనారంభించెను. అప్పుడు రాత్రి జామున్నరప్రొద్దుపోయి నందున జనులందరు నిద్రాసక్తులై యుండిరి. ఈ కేకలచే వారు మేలుకొని మహాపాయ మేదో వాటిల్లినదని యావీథిమనుష్యులెల్ల వడివడినాయుధములధరించి లాహిరియున్న వైపునకు వచ్చిరి. లాహిరి వారిని జూచి అయ్యా! యీ యింట నొక స్త్రీని జెఱ