పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హేమలత

9

పెట్టనికోటవలె నుండుటఁబట్టి చోరులకు సదుపాయ మెక్కువగ నుండెను. ఆ యాలయమునందుఁ బూర్వము శ్రావ్యమైన మురళీనాద మొనర్చుచుండగా యాహిపడగలపై నాట్యముసలుపు శ్రీకృష్ణుని విగ్రహముండెనని పట్టణమునఁ గల వృద్ధు లప్పుడప్పు డాస్థలమును జూచునప్పు డనుకొనుచుందురు. తురుష్కులు చేసిన నాశనమునకుఁదోడు కాలము గూడ దేవాలయ ప్రాకారమును నాశన దేవతపాలు చేసెను. మనము వర్ణించెడు కాలమునాఁటికి ముఖాలయమొకటి తక్క మఱియేమియులేదు. గర్భాలయము సహజముగా నంధకారబంధురమై యుండెను. నాఁటిరేయి మేఘములచే గుడియందు జీకటి పది రెట్లధికముగ నుండెను. మన తెరువరి తడిపిన వస్త్రముల నారఁగట్టి కక్షపాలయందున్న పొడిబట్టను దీసి కప్పుకొని మహాగుహవలె భయంకరముగానున్న యాదేవళముఁ బ్రవేశింప జంకుచుఁ జలిబాధ కోర్వఁజాలక లోనఁ జొరఁబడి తప్పుటడుగు లిడుచుఁ గొంతదూరముపోయి పూర్వము విగ్రహ ముండునట్టి యున్నత స్థలమునఁ గూర్చుండెను. అక్కడక్కడఁ గూర్చుండి తన పూర్వాశ్రమ సంబంధమగు దుఃఖాలోచన సముద్రమున మగ్నుఁడై పరవశత్వముఁ జెందియుండ నానిర్జన ప్రదేశమున నతనికి మనుష్యుల యలికిడి వినఁబడి యాతనిఁ జింతాసమాధినుండి మేలుకొలిపెను. నిర్మానుష్య ప్రదేశమున నరుల యలుకు డగుట కతడాశ్చర్యపడి యది నిజమా యబద్ధమాయని వితర్కించుచుండగా నిద్దఱు మనుష్యులు చీకటియందు దళతళ మెఱయుచున్న ఖడ్గములు హస్తముల ధరియించి గుమ్మముముందఱ నిలువఁబడిరి. అప్పటికి వర్ష మాగిపోయినందున వారిదేహము లంతగా దడిసియుండలేదు. చేతులనున్న ఖడ్గములను గోడకుఁ జేరవైచి గుమ్మము ముందఱనిలచి దేహములను దుడుచుకొనుచు వారొకరితో నొకరు మాటలాడక యెవరి