పుట:Haindava-Swarajyamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

హైందవ స్వరాజ్యము

చదువరి: మీరు విపరీతాలోచనలు చేయుచున్నారు. అందరు సాయుధులు కానక్కర లేదు. మొదట కొందరిని ఇంగ్లీషు వారిని చంపి భయోత్పాతముకలిగించిన యెడల తరువాత ఏకొందరు సాయుధులై నను పనులను నెర వేర్పగలరు. రెండు రెండున్నరలక్షల జనమును మనము నష్టపడవలసి యుందుము. ఆ మాత్రము త్యాగముచేయగలమేని మనదేశము మనపాలగును. చిల్లరయుద్ధముతో ఇంగ్లీషువారిని జయించవలెను.

సంపా: ఈపవిత్రభూమిని మీ రపవిత్రముచేయుట మీతలంపు. హత్యలుచేసి భారతభూమిని సంరక్షించుచింత తోచి నప్పుడే మీకు దేహము వడకుట లేదా ! మనకు కర్తవ్యము మనలను మనమే చంపుకొనవలెను. ఇతరులను చంపనాలోచించుట పౌరుషహీనత్వము. ఇతరులను జంపి మీ రెవరికి స్వాతంత్ర్యము సంపాదింప తలచుచున్నారు. భారతజాతిలో కోటాను కోట్లు దానిం గోరరు. నేటి నవ నాగరకము దిగద్రావి గర్రున త్రేపువా రిట్టియాలోచనలు చేయుదురు. హత్యచేసి పైకెక్కిన వాడు జాతిని సుఖపెట్టుననుమాట కల్ల. ధింగ్రాకార్యమువలనను అట్టి యితరకార్యములవలనను హైందవభూమి లాభము పొందిన దనుకొనువారు మిక్కిలి పొరబడుచున్నారు. ధింగ్రా దేశాభిమానియే కాని అతని యభిమానము అంధప్రాయము. అతడు తప్పుదారిబడి దేహమును ధారపోసినాడు. తత్ఫలము తుదకు చెరుపేకాని వేరుకాదు.