పుట:Haindava-Swarajyamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

నాగరకము.


ప్రపంచములోని ఏమూల కై నను గంటల ప్రయాణమున చేరవచ్చు నని చెప్పుకొనుచున్నారు. మనుష్యులకు చేతులు కాళ్ల సుపయో గించుపని యుండ నేయుండదు. ఒక బొత్తామునొత్తిన కావలసిన యుడుపులు ప్రక్కకువచ్చి పడియుండును. మరియొక బొత్తాము నొత్తిన వలయు వార్తాపత్రిక ప్రత్యక్షమగును. ఇంకొక్క-బొత్తా మునొత్తిన మోటారు బండి ముంగిట నిలబడును. ఇట్లే ఆకటి వేళకు అన్ని రుచులయన్నము అట్టెయెదురగును. అన్ని పనులను యంత్రములు చేసి పెట్టును. పూర్వము యుద్ధము చేయునప్పుడు ఒండొరులు బలపరాక్రమముల ప్రకటించు కొనుచుండిరి. ఇప్పుడు ఒక్కడు మరఫిరంగి వెనుక దాగిన చాలును. వేన వేలను చంప వచ్చును. ఇది నాగరకము. పూర్వము మానవులు బహిరంగణ మున తమశక్తికొలది పాటుపడుచుండిరి. ఇప్పుడు వేనవేలు కర్మ కరులుచేరి కడుపు కక్కుతి కై కర్మాగారములలో గనులలో పనిచేయు చున్నారు. వారి స్థితి పశువుల స్థితికంటె నన్యాయము. లక్షాధి కారుల మేలున కై వీరు మహాపాయకరమగు వృత్తులలో ప్రాణమునకు తెగి పరిశ్రమ చేయవలసియున్నది. పూర్వము భౌతి కముగా మనుష్యుని' నిర్బంధించి దాసు నొనర్చుచుండిరి. ఇప్పుడు ద్రవ్యము చూపి, ద్రవ్యము చే పొందనగు మోహపాశము లను చూపి, మనుష్యుల దాసుల నొనర్చుచున్నారు. పూర్వ మెవ్వరు కలనైన కనని యట్టి రోగము లిప్పుడు వేన వేలేర్పడినవి.