పుట:Haindava-Swarajyamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

హైందవ స్వరాజ్యము.

(4) మనము చేయునట్టి పనియంతయు ఇంగ్లీషువారి నభ్యంతర పెట్టుదు మని కాని వారికి ప్రతిచేయవలె ననిగాని చేయరాదు. మనధర్మ మని చేయవలెను. ఇంగ్లీషువారు ఉప్పుపన్ను తీసివేసినా రనుకొందము. మనద్రవ్యము వెనుకకు మరల్చినా రనుకొందము. ఉత్తమోద్యో గములు భారత పుత్త్రుల కిచ్చినా రనుకొందము. ఇంగ్లీషుసైన్యములను తీసి వేసినా రనుకొందము. అప్పటికిని యంత్రనిర్మిత వస్తువులను వినియోగింపబోము. ఇంగ్లీషుభాష నుపయోగింపబోము. ఇంగ్లీషువారి పరిశ్రమలను ప్రోత్సహింపబోము. ఇవి సహజముగనే స్వభావసిద్ధముగనే దుష్టములు. కాబట్టి యివి మన కక్కర లేదు. ఇంగ్లీషువా రనిన నాకు వైరములేదు. వారి నాగరక మనిన నాకు వైరము. నాయభిప్రాయ మడిగితిరా ఇదివరలో మనము స్వరాజ్య మనుపదమున కర్థము తెలియక దాని నుపయోగించినాము. నా కర్థమయినంతవరకు దాని స్వరూపమును విశదపరచుటకు ప్రయత్నించినాను. ఆరూపమున దాని నారాధించుటయె ముందు నాజీవితమున ధర్మ మని నాయంతరాత్మ బోధించుచున్నది.


__________