పుట:Haindava-Swarajyamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

హైందవ స్వరాజ్యము.

పందొమ్మిదవ ప్రకరణము.

యంత్రసామగ్రి.

చదువరి: పాశ్చాత్యనాగరకము వల దందురే. ఆ యంత్ర సామగ్రియు వల దనియేనా ?

సంపా: ఈ ప్రశ్న వేసి నాకు తగిలినగాయమును చిదుక పొడిచితిరి. దత్తుకృత హైందవార్థిక చరిత్రను చదివినప్పుడు నేను కన్నీరునించితిని. మరల నా కది జ్ఞాపకమునకురా నా మానసము పీడిత మగుచున్నది. యంత్రములే భారతభూమిని బీదవడ జేసినవి. మాం చెస్టరు మనకుచేసిన యపచారము గణించుటకు రానిది. మాంచెస్టరువలననే మన చేతిపనులన్నియు మృతకల్పము లైనవి.

మరచితి నేనే పొరవడుచున్నాను. మాంచెస్టరు నెట్లు నిందింపవచ్చును. మనము మాంచెస్టరు వస్త్రముల ధరించితిమి. కాబట్టి మాంచెస్టరు వానిని మనకు నేసియిచ్చినది. బంగాళమువారి ధైర్యమును విని సంతసించితిని. అచ్చట వస్త్ర యంత్రాలయములు లేవు. కాబట్టి పూర్వపు చేతినేతను వారు పునరుద్ధరింప గలిగిరి. బొంబయి వస్త్రయంత్రములకు బంగాళమునుండియు ప్రోత్సాహము కలుగుచుండుమాట నిజమే.