పుట:Haindava-Swarajyamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాత్త్విక నిరోధము

103

కాని చరిత్ర మనగా రాజులయు సార్వభౌములయు కార్యా కార్యములే యనుచో అచ్చట ఆత్మశక్తి సాత్త్విక నిరోధముల కార్యపరత్వ మేమూలను కానరాదు. గాజులగనిలో వజ్రము వెదుకరాదు. చరిత్ర యనగా నేడు యుద్ధములచరిత్ర. అందుచేతనే ఇంగ్లీషులో నొకజనోక్తి యేర్పడినది, చరిత్రలేని దేశము, అనగా యుద్ధములు లేని దేశ మని యర్థము, క్షేమదేశము! రాజు లెట్లాడినది వా రొండొరులతో నెట్లు వైరపడినది, వా రొక్కరినొక్కరు ఎట్లు హతము చేసికొనినది చరిత్రలో చక్కగా వర్ణితమయి యున్నది. నిజముగా ఇదియే లోకములో జరుగుపని యైనయెడల లోక మెన్నడో అంతమై యుండును. ప్రపంచకథ యుద్ధములతో ప్రారంభ మగునేని నేటికి ఒక్క మనుష్యు డైనను సజీవియై యుండడు. ఎవ్వరిమీద యుద్ధములు జరిగినవో వారు విశేషముగా నశింపు నందినారు. ఉదాహరణార్థము ఆస్ట్రేలియా ఆదిమనివాసుల నాలోచింపుడు. బయటివారి దాడికి వా రందరు రూపులేక చనినారు. ఒక్కటి జ్ఞాపక ముంచుకొనుడు. ఆ యాదిమనివాసులు ఆత్మశక్తిని వినియోగించ లేదు. తద్వినియోగము చేయని ఆస్ట్రేలియనులుకూడ ఒక్క నాటికి ఆగతియే పట్టవలసి యుందురు. నీట నీదువానికి నీటిగండము తప్ప దనునట్లు కత్తిపట్టువానికి కత్తిగండము తప్పదు.