పుట:Haindava-Swarajyamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశుబలము.

97

కొననెంచి మీశాంతికే మీరు భంగము తెచ్చికొనినారు. ఎప్పుడు దోపిడికలుగునో ఎప్పుడు శత్రువు పైబడునో అనుభయము మీకు శాశ్వతమై పోయినది. మీ ధైర్యము అధైర్యముగా పరిణమించినది. నావాదమంతయు జాగ్రత్తగా ఆలోచింపుడు. నేవిపరీత మేమియు వర్ణింపలేదనుట మీ కె గోచరమగును. ఇది మొదటిసాధనము సంగతి. రెండవసాధనము నాలోచింతము. ఆపాదమస్త కాయుధుడైనదొంగ జ్ఞానవిహీనుడగుసోదరు డని గుర్తెరుగుదు రేని సరియైన తరుణమున ఆతనికి సంగతులు స్పష్టపరుప నిశ్చయింతురు. ఎట్లైనను సోదర మానవుడుకదా యని జాలిగొందురు. ఎందు కతడు దొంగలింపబయలు దేరినాడో ఊహింపజొత్తురు. అంతట సమయ మయినప్పు డీతనిదొంగ గుణము నశింప జేతును గాక యని తీర్మానించుకొందురు. మీ రీయాలోచనలలోనుండగనే అతడు మరల దొంగలించుటకు వచ్చును. మీరు నానిని కోపపడరు. వానిపై జాలిగొందురు. ఈదొంగగుణము వానికి నంటిన రోగమని మీ రెన్నుదురు నాటినుండి మీరు తలుపులు, కిటికీలు తెరచిపెట్టుదురు. మీరు పరుండుతావు మార్చి మీసొత్తు అతనికి సులభముగా దొరకునట్లుగా పెట్టియుంతురు. మరల దొంగ వచ్చినాడు. పరిస్థితి యంతయు క్రొత్త యయినది. అతనికి విభ్రమము తోచినది. అయిన మీవస్తువులమాత్ర మెత్తుకొనిపోయినాడు. అతనిమానస మూరకయుండునా?