పుట:Gutta.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
గుత్తా

‘‘గు’’ అనగా రహస్యము అని అర్థము. జగతిలో అత్యంత రహస్యమూ, అన్నిటికంటే పెద్దదీ, ఎవరికీ తెలియనిదీ ఒకే ఒకటి కలదు. అదియే దైవము. ప్రపంచములో ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యము దైవము మాత్రమే. ఎవరికీ తెలియని రహస్యము దైవము అయినప్పుడు దైవమును గురించి ఎవరైనా ఎలా చెప్పగలరు? అని ప్రశ్న రాగలదు. దానికి జవాబుగా ఎవరూ చెప్పలేరనియే చెప్పవచ్చును. దైవమును గురించి ఎవరూ చెప్పలేనప్పుడు, దేవుని గురించి మనుషులకు ఎలా తెలియునని కూడా ప్రశ్న రాగలదు. దానికి జవాబుగా ఒకేమాటను చెప్పవచ్చును. అదేమనగా! దేవున్ని గురించిన జ్ఞానమును దేవుడే తెల్పాలి తప్ప ఏ మనుషులూ చెప్పలేరని ఏకధాటిగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఒక చిక్కు సమస్య వచ్చి పడుతుంది. అదేమనగా! దేవుడు ఎవరికీ తెలియని వాడేకాక, ఆయనకు రూపముగానీ, పేరుగానీ, పనిగానీ ఏమాత్రము లేవు. రూప, నామ, క్రియలులేనపుడు, ఒక క్రియ (పని) అయిన జ్ఞానము తెలియజేయడమును దేవుడు చేయడు కదా! అంతేకాక ఆకారము, పేరు లేనివాడు ఎలా చెప్పగలడు? ఆకారమున్నవాడు చెప్పితేగాని అర్థముకాని మనుషులకు, ఆకారము లేకుండా మాటల రూపముతో చెప్పుటకు వీలుకాదు. ఈ విధముగా పేరులేనివాడు, ఆకారమే లేనివాడు, పనియే చేయనివాడు దైవ జ్ఞానమును తెలుపుటకు అవకాశమే లేదు. అటువంటపుడు దేవునికి తప్ప ఎవరికి తెలియని దేవుని జ్ఞానము, మానవులకు ఎలా తెలియునని ఎవరైనా అడుగవచ్చును. ఇటు చూస్తే నుయ్యి (బావి) అటు చూస్తే గొయ్యి (గుంత) అన్నట్లున్న ఈ ప్రశ్నకు జవాబు చెప్పడము చాలాకష్టము. ఎంత యోచించినా జవాబే దొరకని ఈ ప్రశ్నకు చివరకు దేవుడే జవాబు చెప్పాలి. ఆ విధానము ప్రకారమే మా యోచనకు ఒక జవాబు దొరికింది. అదేమనగా!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/5&oldid=230396" నుండి వెలికితీశారు