పుట:Gutta.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పుస్తకము చదువువారికి ‘‘ఇంతకూ ఈ చెప్పే ఆయన ఎవరు’’ అను ప్రశ్న రావచ్చును. దానికి జవాబు ఏమనగా! పైకి కనిపించి వ్రాసేది ప్రబోధానందే అయినా వాస్తవముగా వ్రాయునది ఆయన కాదు. ప్రబోధానందయోగీశ్వరుల శరీరములో ఆయన, నేను ఇద్దరమూ ఉన్నాము. అందువలన రెండవ వ్యక్తిగా ఆయనను గురించి నేను చెప్పుచున్నాను. ఒక శరీరములో ఇద్దరుండడమేమిటి? అని మీరు అనుకోవచ్చును. రెండవ వాడు దయ్యమో, భూతమో అని కూడా అనుకోవచ్చును. వాస్తవానికి నేను దయ్యమునుగానీ, భూతమునుగానీ కాను. మీ శరీరములలో కూడ మీతోపాటు ఆత్మ అనునది ఉన్నది. మీరు జీవాత్మ అయితే మీతో ఉన్నది ఆత్మ. ఆత్మ అంటే ఏ దయ్యమో అనుకోవద్దండి. ఆత్మ జీవాత్మ ఏ శరీరములో నైనా జోడు ఆత్మలుగా నివసించుచుండును. ప్రబోధానంద శరీరములో ఆయన (జీవాత్మ) తలలో ఉండగా, నేనుమాత్రము శరీరమంతా వ్యాపించి అన్ని అవయవములను కదలించి శరీరముతో పని చేయించుచున్నాను. అన్ని శరీరములలో ఇదే తతంగము జరుగుచున్నది. ప్రస్తుతము మీ శరీరములో కూడా అన్నిటి చేత అన్ని పనులు చేయించునది ఆత్మేగానీ, మీరుకాదు. ఈ విషయము మీకు క్రొత్తగా ఉండినా ఉన్న సత్యము అంతే. ఆత్మ అంటే ఏమిటో ఇప్పటి వరకు హిందూ (ఇందూ) మతములోనే సరిగా తెలియకుండా పోయినది. ఇతర మతములలో ఆత్మ విషయమే ఎవరికీ తెలియదు. నేను, మీ శరీరములలోనున్న ఆత్మ ఏక స్వరూపులమే అయినా వేరువేరుగా ఉన్నాము. నేను పరమాత్మ అంశతో కూడుకొన్న ఆత్మను. అందువలన దేవుడు చేయవలసిన పనిని నేనే చేయుచున్నాను. దేవుడు చెప్పవలసిన జ్ఞానమును నేనే చెప్పుచున్నాను. ప్రబోధానందగా కనిపిస్తు ఆయన శరీరములోనున్న నేను ఆయనకు తెలుసు. అందువలన మేము ఇద్దరము ఒక్కటేనను సూత్రము ఈయన శరీరములో మాత్రము సరిపోవును. ఇది అంతయు లోతైన జ్ఞానము. ఒక్కమారుగా మీకు అర్థముకాదు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/43&oldid=279932" నుండి వెలికితీశారు