పుట:Gurujadalu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోపాలకృష్ణ తిరుపతిలో 'ఉదయం' దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్‌గా ఉన్న రోజుల్లో "గురజాడ అధ్యయన కేంద్రాన్ని" నెలకొల్పారు. త్రిపురనేని మధుసూదనరావు, భూమన్, సాకం నాగరాజు మొదలైన మిత్రులతో కలిసి కన్యాశుల్కం నూరేళ్ళపండుగ ఏడాది పొడవునా నిర్వహించారు.

గురజాడమీద ఒక వర్గం దారుణంగా విమర్శలు చేసినపుడు కే.వి.ఆర్. ప్రోత్సాహంతో గోపాలకృష్ణ ఆ విమర్శలకు అరుణతారలో సమాధానం రాశారు. ఆయన గురజాడమీద రాసిన వ్యాసాలు జమీన్ రైతు, ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్త తదితర పత్రికల్లో అచ్చయ్యాయి.

సౌత్ ఆఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భారతీయుల పాత్రను వివరిస్తూ గోపాలకృష్ణ రచించిన "ఇంద్రధనుస్సు ఏడోరంగు" ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది.

గురజాడ సాహిత్యంమీద, ప్రత్యేకంగా కన్యాశుల్కం మీద తన అధ్యయన సారాన్ని గోపాలకృష్ణ "మధురవాణి ఊహాత్మక స్వీయచరిత్ర"గా రచించారు. ఈ పుస్తకం పరిశోధనకు, కాల్పనిక రచనకు మధ్య ఉన్న సరిహద్దును చెరిపివేసి తెలుగుసాహిత్యంలో ఒక కొత్త ప్రక్రియకు దారి చూపించింది. గురజాడ ఇంగ్లీషులో రాసుకున్న దినచర్యలు మొట్టమొదటిసారి గోపాలకృష్ణ సంపాదకత్వంలోనే ఇంగ్లీషులో అచ్చయ్యాయి.

గోపాలకృష్ణ ఎప్పుడూ గంభీరంగా, హుందాగా వ్యవహరించేవారు. మితభాషి, హాస్యప్రియులు. ఆయన వచన రచనలో గొప్ప పరిణతి, నైపుణ్యం సాధించారు. ఆయన్ను ఎరిగినవారు "గోపాలకృష్ణ పెర్ఫెక్షనిస్టు" అంటారు.

గురజాడ సమగ్ర సాహిత్యం - 'గురుజాడలు' కు సంపాదకులుగా శ్రమించి, ఆ సంపుటం ఆవిష్కరించబడుతున్న వేళ, ఆయన మన మధ్య లేకపోవడం తీరని లోటు - గొప్ప విషాదం.

గోపాలకృష్ణ ఆత్మీయ మిత్రుడిగా ఆయన స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ పరిచయాన్ని ముగిస్తున్నాను.

-డాక్టర్ కాళిదాసు పురుషోత్తం