పుట:Gurujadalu.pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిరర్గళముగా తూగినవారు, ఆ భాషనే వ్రాసి ఆనందింతురు గాక! ఎవరు వొద్దనిరి? పండితులు వ్రాయనూ వచ్చును. వెతికి తప్పుల బట్టి ఒకరినొకరు దూషించుకొను వ్యాపారమును కల్పించు కోనూవచ్చును. యెవరు వొద్దనగలరు? చిత్రము! నా రాతలవల్ల “త్రిలింగ” భాషకు ముప్పు వచ్చెనని శతావధానిగారు విలపించుచుండగా ఆ పేజీలోనే వెంకటరాయ శాస్త్రిగారు, శతావ ధానులుగారి రాతల వల్ల “ఆంధ్రభాషా యోషామణి కెన్నిపాట్లు వచ్చుచున్నవి” అని వ్రాసిరి. భాషకు ముప్పువచ్చునో లేదోకానీ, ఈ దొమ్మిలాట వల్ల పత్రికలు చదువు వారికి తప్పక ముప్పు వచ్చుచున్నది. కవిత్రయము వారి గద్యములను, అవధానిగారు వ్రాసిన విమర్శన గద్యమును, పాక్షిక దృష్టి విడిచి, శతావధానులుగారు తైపారువేసి చూచినచో శబ్దములయందును, రూపముల యందును, అన్వయఫక్కియందును వారి తోవను తప్పి వీరెంత దవ్వున నడచిరో, శతావధానులే తెలియగలరు. ఇంత మార్పును తెచ్చిన శతావధానులే భాషా సంస్కరణధురీణులు గాక ఒరులెట్లు కాగలరు? వారితోవనే కదా, మా బోట్లము పోవుట. “మహాజనో యేన గతస్సపంథాః”. ఆంధ్ర గీర్వాణ సాహిత్యములు కలిగి తెనుగు వ్రాయు వారు మిక్కిలి యరుదు. దేశములో నూరుమంది వుండరని నిశ్చయముగా చెప్పగలను. మాట వరసకు నూరంటిని. అంతకును చాలా తక్కువే. సంస్కృత సాహిత్యము లేని వారు కోటాను కోట్లు. పత్రికలలోనూ, నవీన నాటకాది గ్రంథములలోనూ వారి లక్షణ సాలిత్యములు యెన్న వశమా? అట్టి తప్పుల తడకను వ్రాసి, ఆ రాతను గ్రాంథిక భాష అనుకొనుట కన్న, ఇప్పటి నాగరకులును, శిష్టులును వ్యవహరించు భాషనే రాసుకొనరాదా? ప్రౌఢ గద్య కావ్యములనూ, పద్య కావ్యములనూ వ్రాయువారు గ్రాంథిక భాషలోని యింపగు పదములను తీసికొందురు గాక. సులభ సాధ్యమగు నవీన వ్యావహారిక భాషాకటి ప్రబలిన యెడల, బుద్ధిబలము కలిగియు, మూగులైయున్న మనవారెందరు గ్రంథము లను వ్రాసి భాషను వృద్ధి చేయరు? పుట్టు కవులయి, కఠినమగు గ్రాంథిక భాష నేరని వారి కది మహోపకారము కదా? వాడుక భాష కావ్యరచనకు తగదని శతావధానుల అభిప్రాయము. తగునని నా అభి ప్రాయము. వాడుక భాషలే కదా, కవులు రాయ రాయ గ్రాంథిక భాషలైనవి. యీ భారత వర్షములోనూ, యితర దేశములలోనూ, వాడుక భాషలలో రసవంతమైన కావ్యములు పుట్టి యుండలేదా? బర్న్స్ అను మహాకవి మాట, శతావధానులు గారు వినలేదో! గురుజాడలు 619 ముత్యాల సరాల లక్షణము