పుట:Gurujadalu.pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముత్యాల సరాల లక్షణము ఆగష్టు నెల 17వ తేదీని వెలువడిన ఆంధ్రపత్రికలో వొక శతావధాని గారు నే రాసిన ముత్యాల సరములను గేయములను విమర్శించిరి. ఆపత్రిక నాకు అందినప్పుడు, నేనా విమర్శనమును చూసియుండలేదు. తరువాత కొందరు మిత్రులు చూసి నాతో చెప్పిరి. ఇంతట్లో మా వూరి 'భారతమాత' శతావధాని గారి వ్రాతను గర్జించుతూ వ్రాసినది. పిమ్మట శతావధానిగారి విమర్శనమును కూడా నేను చదివితిని. విమర్శనమును రాసినందుకు శతావధానిగారికి నేను కృతజ్ఞుడను. చర్చ జరిగిన గాని నిజము వెల్లడి కానేరదు. నా ఉద్యమము వల్ల ఆంధ్రభాషకు ముప్పు వచ్చునను భయము వారికి పొడమి, వారు కొంచము కఠినముగా రాసియుందురు. తప్పేమి? ఆంధ్ర భాషయందు వారికి మిక్కిలి యభిమానముండుటనే కదా? వారి మనసుకు వ్యధ కలిగి ఆ రీతిని వ్రాసి యుండిరి. స్వమతాభిమానమును, పరమత నిరసనమును అందరికిని సహజమే కదా! 'భారతమాత' శతావధానులు గారిని గురించి కొంచము కఠినముగా వ్రాసినందుకు నేను యెంతో విచారిస్తున్నాను. లోకోపకారకములైన గొప్ప సంగతులు చర్చించుతున్నప్పుడు, మనసులు నొచ్చునట్లు రాసి, ఆగ్రహమునకు అవకాశము కలుగ చెయ్యరాదని నా అభిప్రాయము. శతావధానులు పండితులు; పూజ్యులు. వారి వల్ల నాలుగు తిన్నను, చేతనైన యెడల వారిని వొప్పించడము గాని, తెలియని చోట వారి వల్ల తెలుసుకోవడము గానీ, లాభకరము. దూషణము వల్ల లాభము లేదు. సులభమైన కొత్త గ్రాంథిక భాషను కల్పించుకొనడమును గురించి నా అభిప్రాయములను తెలియజేయవలెనన్నచో, పెద్ద గ్రంథమును రాయవలసివచ్చును. ఆ విషయము చర్చించుటకు నాకు యిప్పుడు అవకాశము చాలదు. శతావధాని గారు ఇంగ్లీషు నేర్చిన వారివలే కనపడు తున్నారు. వారు సంస్కృత, ద్రావిడ భాషల వ్యాకరణము లే కాక, ఇంగ్లీషున వ్రాయబడియున్న భాషాశాస్త్ర, భాషాచరిత్రములను కూడా చదివియున్నయెడల, వారిని అందలి సంగతులు జ్ఞాపకము తెచ్చుకొండని ప్రార్థించుట తప్ప, నేను చేయవలసిన పని వుండబోదు. ముత్యాల సరములు గురించి మాత్రం యిక్కడ వ్రాసెదను. ముత్యాలసరములలో కొన్ని అచ్చు తప్పులున్నవి. గురుజాడలు ముత్యాల సరాల లక్షణము 615