పుట:Gurujadalu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ

(1937-2011)

శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ జర్నలిజంపైన మక్కువతో న్యాయవాదవృత్తిని విడిచిపెట్టి, నెల్లూరులో యూత్ కాంగ్రెస్ వారపత్రిక సంపాదకులుగా, జమీన్ రైతు సహాయ సంపాదకులుగా దాదాపు పదిహేనేళ్ళు పనిచేశారు. పదేళ్ళు ఆకాశవాణి జిల్లావిలేకరిగా ఉన్నారు. తను నెల్లూరులో 'వర్ధమాన సమాజం' కార్యదర్శి అయిన తర్వాత ఆ సమాజం నిర్వహించే ప్రాచీన కవుల జయంతులతో పాటు వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు జయంతులు నిర్వహించారు. కావలి 'జవహర్ భారతి' అధ్యాపకులు కే.వి.రమణారెడ్డి, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.పట్టాభిరామిరెడ్డి గార్ల స్నేహం, నేలనూతల శ్రీకృష్ణమూర్తిగారి సాన్నిహిత్యం గోపాలకృష్ణ దృష్టిని చరిత్ర, సాహిత్యంవైపు మరల్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడుగా ఎన్నిక కావడం కూడా ఇందుకు దోహదపడింది.

వర్ధమాన సమాజ సభల్లో మహాపండితులు ఏటా కవిత్రయం మీద ఉపన్యాసాలు చేసేవారు. వారి ఉపన్యాస పాఠాలు సేకరించి, గోపాలకృష్ణ "కవిత్రయ కవితా వైజయంతి" పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పుడది ఒక రెఫరెన్సు గ్రంథం. వర్ధమాన సమాజం తరఫున ఆయన కావలి రామస్వామి "డెక్కన్ పోయెట్సు"ను పునర్ముద్రించారు; పఠాభి "ఫిడేలు రాగాల డజన్", "కయిత నాదయిత" కవితా సంకలనాలను వెలువరించారు.

నెల్లూరు సాంస్కృతిక జీవితంలో గోపాలకృష్ణ క్రియాశీలక పాత్ర నిర్వహించారు. 'యువభారతి' సంస్థను నిర్వహించి, నెల్లూరులో లలితకళలపట్ల స్పృహ కలుగజేశారు. అభ్యుదయ వేదిక, ప్రోగ్రెసివ్ ఫిల్మ్ సొసైటి తదితర సమాజాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ఆయన సినిమాల మీద, నాటకాలమీద చిరకాలం గుర్తుంచుకోదగిన మంచి సమీక్షలు చేశారు. జమీన్ రైతు పత్రికలో వారం వారం 'మాటకచేరి' శీర్షికలో స్థానిక విషయాల నుంచి, గొప్ప గ్రంథాల పరిచయం వరకు వైవిధ్యంగల విషయాలమీద చర్చించారు.

డాక్టర్ ఎం.పట్టాభిరామిరెడ్డిగారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థను ప్రారంభిస్తున్నప్పుడు ఆయనకు అండగా నిలబడ్డారు. గోపాలకృష్ణ ఏ.పి. హిస్టరీ కాంగ్రెస్ ఫౌండర్ మెంబర్స్‌లో ఒకరు.