పుట:Gurujadalu.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఓరి వెఱ్ఱివాడ! మీ వూరి గోపురం యెవరిక్కావాలిరా! నీకు బోధపడదు. చిన్నతనంలో యెప్పుడూ ఆ గోపురం మీదనే. యెందుకా తీపులు, మా గోపురం కథాశేషమైఁంది.”

లేచి “శివ శివ -” ఓరే, మీ వూరి గోపురం కూడా యీ మ్లేచ్చులు పడగొట్టి వుంటాఱ్ఱా!”

“మీకు యేమి ఉపద్రవం వచ్చింది? పడగొడితే ఆ పాపం వాళ్ళనే కొడుతుంది. ఆకలేస్తూంది, పెందరాళే వూరు చేరుదాం!

“యేం వూరు - యేం చారడం! ఆకలంతా పోయిందిరా!”

నారాయణభట్టు లేచి మౌనము వహించి కొంత తడవు నడచెను. అంతట తలయెత్తి చూడ సంజ చీకటిలో నెలి వెలుగు కమ్మిన పడమటి ఆకాశమును చూసి రెండు మసీదు స్తంభములు కళ్ళ యెదుట నిలిచెను. నారాయణభట్టు మరల నిలిచిపోయి స్తంభముల పరికించుచు;

“కాకుళేశ్వరుడి గుడి పగలగొట్టి మ్లేచ్ఛుడు మసీదు కట్టాడు” అనుకొనెను.

“దేవుఁడెందు కూరకున్నాడు. స్వామీ?

“ఆ మాటే యే శాస్త్రంలోనూ కనబడదురా పుల్లా. మసీదు వేపు పోదాం పద.”

“మసీదు గానీ సత్రం అనుకున్నారా యేమిటి? పెందరాళే భోజనం మాట ఆలోచించు కోకపోతే ఉపవాసం తటస్థిస్తుంది”.

“అంత మహాక్షేత్రం పోయిన తరువాత తిండి లేకపోతే వచ్చిన లోటేమిటి?”

కాలుకు కొత్త సత్తువ పుట్టి గురువును, కాలీడ్చుచు శిష్యుడును, గట్లంట పుట్టలంట బడి మసీదు ద్వారం చేరిరి.

“యేమి తీరుగా కట్టాడు స్వామీ, మసీదు”!

“వాడి శ్రాద్ధం కట్టాడు!"

గెడ్డము పెంచి యాబది సంవత్సరములు ప్రాయము గల ఒక తురక చిలుము పీల్చుచు కూర్చుని యుండ నారాయణ భట్టు 'సలా'మని ఇట్లడిగెను.

“భాయీ! యిక్కడే కదా పూర్వం శివాలయం వుంటూ వచ్చింది”.

తురక ఒక నిమిషమూరుకొని నోటిలోని పొగ నెగనూది “హా సైతాన్కాఘర్" అనీ యుత్తర మిచ్చెను.

“యేం పాట్లొచ్చాయీ దేవుఁళ్ళకి!”

“దేవుళ్ళకి యేపాట్లూలేవు - మన సాపాటు మాట ఆలోచించరేం?”

గురుజాడలు

545

మతము : విమతము