పుట:Gurujadalu.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నువ్వు చెప్పవలసిన మాటలు చెబుతాను”, బాగా వీను. “పంతులికి బుద్దీ వచ్చింది. యిక యెన్నడూ సానుల పాట వినరు. రాత్రులు యిల్లు కదలరు. యిదీ ఖరారు”. తెలిసిందా? మిమ్ములను గెడ్డము పట్టుకుని బతిమాలు కున్నానని చెప్పమన్నారు. దయదలచి ఆయన లోపములు బయలు పెట్టక రెండు మూడు రోజులలో వెళ్ళిపోయి రమ్మన్నారు. మీరులేని రోజో యుగముగా గడుపుతున్నారు. అని నిపుణతగా చెప్పు- తెలిసిందా?”

“తెలిసిందీ బాబూ!”

“యేమని చెబుతావో, నాతో వొక మాటలు చెప్పు”.

రాముఁడు తలగోకుకొనుచు “యేటా - యేటా - అదంతా నాకేం తెలదు బాబూ - నానంతాను. అమ్మా! నామాటినుకోండి - కాలం గడిపినోళ్లీ - ఆడోరు యెజిమాని చెప్పినట్టల్లా యిని పల్లకుండాలి. లేకుంటే మా పెద్ద పంతులార్లాగ అయ్యగారు కూడా సానమ్మ నుంచు గుంతారు. మీ శైవులో మాట, పట్టంలోకి బంగారబొమ్మలాంటి సానమ్మ వొచ్చింది. మరి పంతులు మనుసు మనుసులో లేదు. ఆపై మీ సిత్తం. అంతాను.

“ఓరి వెధవా!” అని గోపాలరావు కోపముతో కుర్చీ నుండి లేచి నిలిచెను.

ఊసవలే రాముడు వేలి కెగసెను.

అంతట మంచము క్రింద నుండి అమృత నిష్యందీని యగు కలకల నగవును కరకంక ణముల హృద్యారావమును విననయ్యెను.

(ఆంధ్రభారతి 1910 ఫిబ్రవరి)

గురుజాడలు

528

దిద్దుబాటు