పుట:Gurujadalu.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మా చెలుల వలన నీజము నేర్చితిని. నేనింట నుండుటను గదా మీరు కల్లలు పలుకవలసి వచ్చే. నేను పుట్టింట నున్న మీ స్వేచ్ఛకు నిర్బంధమును, అసత్యమునకు అవకాశమును కలుగకుండును. మీచే దీన దీనమును అసత్యమాడించుట కన్న మీ త్రోవకు అడ్డుగ నుండకుం డుటయే, పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కాదా? నే నీ రేయి కన్నవారింటికి జనియెద సంతసింపుఁడు. వేచ్చము గాక యేపాటి మిగిలియున్నను దయ నుంచుఁడు.”

ఉత్తరము ముగించి “నేను పశువును” అని గోపాలరావు అనెను.

“అదేటి బాబు ఆలా శలవిస్తారు?”

“శుద్ద పశువును!”

రాముఁడు అతి ప్రయత్నముచే నవ్వు ఆచుకొనెను.

“గుణవతి, విద్యానిధి, వినయ సంపన్నురాలు, నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసినది”.

“యేటి చేసినారు బాబూ?”

“పుట్టింటికి వెళ్ళిపోయినది - గాని నీకు తెలియకుండా యెలా వెళ్ళిందిరా?”

రాముఁడు రెండడుగులు వెనుకకు నడిచీ “నాను తొంగున్నాను కావాల బాబూ - అలక చేస్తే చెప్పుచాలు గాని బాబు ఆడదాయి చెప్పకుండా పుట్టినారింటికి యేల్తానంటే లెంపలాయించి కూకోబెట్టాలి గాని, మొగోరిలాగ రాతలూ కోతలూ మప్పితే ఉడ్తోరం పుట్టదా బాబూ?”

“ఓరి మూర్ఖుఁడా! భగవంతుడి సృష్టిలోకల్లా ఉత్కృష్టమైన వస్తువ విద్య నేర్చిన స్త్రీ రత్నమే. శివుఁడు పార్వతికి సగం దేహము పంచి యిచ్చాడు. యింగ్లీషు వాఁడు భార్యను బెటర్ హాఫ్ అన్నాడు. అనగా పెళ్ళాము మొగునీకన్న దొడ్డదీ అన్నమాట. బోధపడ్డదా?”

“నాకేం బోధ కాదు బాబూ” రామునికి నవ్వు ఆచుకొనుట అసాధ్యమగుచుండెను.

“నీ కూతురు బడికి వెళ్ళుతున్నది గదా; విద్య విలవ నీకే బోధపడుతుంది. ఆ మాట అలా వుండనియ్యి కానీ, నువ్వో నేనో వెంటనే బయలుదేరి చంద్రవరం వెళ్ళాలి. నేను నాలుగు రోజుల దాకా వూరి నుంచీ కదలడముకు వీలు పడదు. నువ్వు తాతల నాటి నౌఖరువి. వెళ్ళి కమలినీని తీసుకురా. కమలినితో యేమి జెప్పవలెనో తెలిసిందా?”

“యేటా? బాబూ! బాబు నా యీపు పగలేసినారు, రండమ్మా అంతాను”.

“దెబ్బల మాట మరచిపో, కొట్టినందుకు రెండు రూపాయలిస్తాను తీసుకో. మరీ యేన్నడు ఆ వూసేత్తకు. కమలినితో గానీ తప్పిజారి అనఁబోయేవు సుమా”.

“అనను బాబూ”.

గురుజాడలు

527

దిద్దుబాటు