పుట:Gurujadalu.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



యెక్కాలి. కుఱ్ఱవాడి పెళ్ళి వ్యవది లేదు. కందులగూనలో కాసులు చేతపడితేనే గాని పప్పుడకదు. యేమిటి సాధనం... మరేమిటీ లేదు. తిన్నగా వెళ్లడం యెవరూ చూడకుండా లోపల ప్రవేశించి, తటాలున దీపం ఆర్పివెయ్యడం. కందులగూన దగ్గరకు ఒక్క దాటు వేసి కాసుల పొట్లాం సంధించుకొని ఆంజనేయులలాగ పైకి లంఘించడం... వెళదామా... తురకాడితో సానింటికి వెళ్లనని చెప్పానే... వెధవ చూడొచ్చాడాయేమిటి.... వాడికిదే తనుసా? గొడ్డును కోసుకుతినే వాడు సర్వాం తర్యామా యేమిటి? కోళ్ల కొట్టు మేడ తలుపు తాళం వేసి వుంది. మంత్రజాలం సాయిబు వూళ్ళో లేడు. ఆ చుట్టు పట్ల యెంతో సేపు నిలబడ్డాను. హుక్కా పొగ వాసన రవ్వంతైనా కనపడలేదు. “పర్వతోవహ్నిమస్థమాత్ ధూమాత్" అన్నాడు. ధూమం లేకపోతే అగ్గి లేదు. అషువలెనే హుక్కా ధూమం లేదనే కారణం చేత అగ్గి రాముడనే సాయిబు కూడా నాస్తి, యితి సిద్ధాంతః - ("కబడ్దార్' అని ఒక కేక వినపడును. ) ఓరిదేమిటిరోయి నాయినా! తురకాడి గొంతుక వినపడుతూంది. వూళ్లో లేని తురకాడి మాట యిక్కడి కెలా వచ్చింది. వందేమాతరం గుంటడెవడో కేకవేసి వుంటాడు... అంతే... అదే నిజం... కాని వొళ్లు కొంచెం కంపరం పుచ్చుకుంది. శబ్దం విని భయపడితే మరేం పౌరుషం శబ్దగుణం ఆకాశం. ఆకాశం నిరవకాశం శబ్దం వట్టి మిథ్య, మిథ్య, మిథ్య, అనగా యేమీ లేదన్న మాట (నాలుగడుగులు నడిచే సర్కీ “కబడ్డార్” అని తిరిగి వినపడును) మళ్ళీ వచ్చింది రోయి ధ్వని.... వణుకు పట్టుకుంది. అయితే యేం చేతాం? ఈ శబ్దానికి భయపడి రెండు మూడు వందల రూపాయల సొమ్ము వదులుకుంటానా? తురకాడు వస్తే యేం జేస్తాడు? ఇంగ్లీషు బావుటా చల్లగా ఉండాలి గాని చెయ్యి జేసుకున్నాడంటే తురకాణ్ణి పోలీసు వారికి వప్ప చెప్పుతాను. కబడ్దార్ అప్పుడు తెలుస్తుంది. ఎందుకేనా మంచిది ఆంజనేయ దండకం చదువుతూ ఒక్క విసరున వేళ్లానంటే అన్ని భయాలూ పటాపంచలైపోతాయి. శ్రీ మన్మహా అంజనీ గర్భసంభూత సదా బ్రహ్మచారీ కపీంద్రాదివంద్యా కిరీటోజ్జ్వలద్రత్న...” (మంజువాణి యింటి గుమ్మం దగ్గర నిలిచి, మెల్లగా తొంగి చూచి) సావిట్లో యవరూ లేరు.... సావిడి గదిలోనూ లేరు.... (మెల్లగా దీపం ఆర్పేసరికి గభీమని వీధి తలుపు గడియ వేస్ని చప్పుడగును.) చంపేశాడ్రోయి సాయిబూ... అని) మంజువాణీ! బ్రహ్మహత్య జరిగి పోతూంది.

మంజు : మళ్లీ సాయిబుని తీసుకొచ్చావు? ఇదిగో కందులగూన వున్న గదిలోనికి వెళ్ళి గడియ వేసు కుంటున్నాము. బ్రహ్మ హత్య జరిగితే స్వయంకృతాపరాధం గాని పాపం మాది కాదు.

గురుజాడలు

520

కొండుభొట్టీయము