పుట:Gurujadalu.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఒక మతం - కడుపు కాల్తూవున్నప్పుడు ఒక మతం - కడుపు నిండినప్పుడు ఒక మతం - అందులో అంబలి మతం - పప్పు నెయ్యి మతం - గోధుమ రొట్టె మతం - మద్యమాంస మతం - యేరెకుతినే వాకపళ్ళ మతం- డబ్బిచ్చి కొనే మామిడిపళ్ల మతం - గడవడం గడవకపోడాన్ని బట్టి అంతర్భేదాలు కలవు. అలసివున్నప్పుడో మతం - వంటరిగా వున్నప్పుడో మతం - అతివ శంతనున్నప్పుడు ఒక మతం - లంగరు లేని నావలాగ మతం మనస్సు యొక్క శరీరము యొక్క స్థితిని బట్టి చెలిస్తూ ఉంటుంది. కొన్ని వెఱ్ఱెలు మాత్రం నాకు వున్నాయి అనుకుంటాను. మనసుకు మాటకు విడాకులైనప్పుడు మాటునున్న మాట మార్కట్టులో పెట్టాలనే పట్టలేని ఉత్సాహం ఒకటి -సూదంటి రాయిని యినుమంటినట్లు మంచివాళ్లు కనిపిస్తే వాళ్లను ఆనుకొను స్వభావం రెండు -యెదిరించిన వాడి మీద కయ్యానికి కాలు దువ్వడం మూడు - కష్ట సాధ్యమైన పని తటస్థించి ఫలితం మంచిదని తోస్తే ముందూ వెనకా చూడకుండా అందులో వురకడం నాలుగు-లైఫ్ (life) లో వుండే చమత్కారాలు వెతుక్కుంటూ పోవడం అయిదు - తమ వంటి పెద్దల శలవు ప్రకారం నడుచుకోవడం ఆరోమతం. అక్కడికి షణ్మతాలు స్థాపనయినాయి. ఇన్ని మతాలు ఒక్క చోట గూడిన ఒకతేన్ను యెలా వెళతాయి.

ది.రా : అందుచేతనే లోకం నువ్వు చెప్పినట్టల్లా వింటారు. అటువంటి మనిషివి నాబోట్లు చెప్పినట్టు వినడమనేది వాత్సల్య సూచికం. ఆ మాత్రం ఆసరా యిచ్చావంటే నేను కూడా సంఘ సౌంస్కారానికి కించిత్ సహాయభూతుణ్ణి కాగలను. ప్రస్తుతాంశమేమిటి?

గిరీ : మీరు చేస్తానన్న ద్రవ్య సహాయము సెటిల్ (settle) కావలెను.

ది.రా : రామమూర్తికి మూడు వందల రూపాయలు యిస్తానన్నానే.

గిరీ : యెప్పుడు?

ది.రా : పెళ్లి అయిన తక్షణం.

గిరీ : బ్రహ్మ సమాజ మత ప్రకారం వివాహం కాక శాస్త్రోక్తంగా అయితే?

ది.రా : బేసవబుగా అయిన పనిలో మనం యేలా సహాయ భూతులం కాగలం?

గిరీ : యే ప్రకారం జరిగినా సరే, ఇప్పుడు ఆ సొమ్ము చేతులో పడితేనే ముందు పని జరగడం లేకుంటే యిక్కడితో సమాప్తి.

ది.రా : Hard terms. you can trust me to pay.

గిరీ : Immediate payment will obviate the necessity for trust, Some money has to go in to the hands of divers persons persons including the brid.

గురుజాడలు

509

కొండుభొట్టీయము