పుట:Gurujadalu.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ : (నిర్ఘాంతపోయి) యెవరు చెప్పారేమిటి?

అక్కా : యెవరూ చెప్పలేదు..... లేదు మీ మాటల వల్లా, మీ చెర్యల వల్లా ఊహించాను. మరేం భయపడకండి. అది మహా మంచిపని. మీ తండ్రి ఆదాలో వుంటే రత్నం లాంటి పిల్ల చెడిపోతుంది - యీ మాట పొక్కేలోగా శీఘ్రంగా కానియ్యండి - నా చేతనయ్ని సహాయం చేస్తాను.

రామ : నిజంగాను?

అక్కా : లింగం సాక్షి.

రామ : అయితే మా గురువు గిరీశంగార్ని తీసుకొస్తాను.

(యిద్దరు నిష్క్రమింతురు)

కొండుభొట్టీయము

ద్వితీయాంకము

నవమ రంగము

(మంజువాణి యిల్లు - ఒక బల్ల చుట్టూ కుర్చీలు - బల్లమీద గళాసులు - విప్పిన సీసా.) (మంజువాణి మంచం మీదను త్రివిక్రమరావు పంతులు ఈజీ చెయిరు మీదను మితిమీరి పడివుందురు)

కొండు : (చప్పుడు కాకుండా బొటన వ్రేళ్ళమీద నడచి వచ్చి త్రివిక్రమరావును కదిపిచూచును. తెలివిరాదు. ఆత్మగతం) జేబులో యేముందొ-(చెయి జేబులో జొరిపి మనీపర్సు తీసి-విప్పిచూచి, ఆత్మగతం) దీనిలో పెద్ద కాసులు చాలా వున్నాయి-యివి వీడికీ దక్కేవి కావు - వివాహ కార్యం క్రింద వినియోగపరిస్తే కొంత పుణ్యం అయ్నా వీడికి దక్కుతుంది. రెండు కాసులు మంజువాణికి యిచ్చేటందులకు యిందులో వుంచి యిదిగో జేబులో మళ్లీ పడేస్తాను. కడంవి కాకితం పొట్లాం కట్టి కందులజాడీలో లోతుగా కప్పివేస్తాను.

(నిష్క్రమించును)

త్రివిక్ర : (నిద్రలో కాలుజాచగా సారాబుడ్డి నేలకిపడి చప్పుడవును, అంతట వులికిపడి లేచి, మరి ఒక గళాసు పుచ్చుకుని) దీనికి డబ్బిచ్చి వెళుదాం.

(జేబులో మనీఫర్సు తీసి చూచి నిర్ఘాంతపోయి ప్రకాశం) ఆ! రెండే వున్నాయి - కడంవి యెవరు దొబ్బారు. అది మంచం మీద వొళ్ళెరక్క పడే వున్నది. లేక నేను

గురుజాడలు

499

కొండుభొట్టీయము