పుట:Gurujadalu.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కొండు : యెరిగి నన్నెందుకడుగుతావూ

రత్నాంగి:బ్రాహ్మడికుండే నీతి నీకు లేకపోయినా - దొంగకి వుండవలసిన నీతైనా నీకున్నందుకు అలరుతున్నాను.

కొండు : అయితే బ్రాహ్మణ్ణి దయదల్చి ప్రాణాల్లో వొదిలి వేస్తావాయేమిటి? నువ్వు ధర్మాత్మురాలివి. యీ పుణ్యం కట్టుకుంటే స్వర్గం యెదురుగా వస్తుంది. కొంచెం ఆసరా యయ్య. జాడిలోంచి పైకి వచ్చి యీ దొంగముండా బొద్దెంకల బాధ వదుల్చుకుంటాను.

రత్నాంగి:శిఖా, యజ్ఞోపవీతం, యిక్కడ సమర్పించి, మరీపైకి రావాలి.

కొండు : అదేవిఁటది?

రత్నాంగి:అలానిలుచుండండి; చెబుతాను (దగ్గరకు వెళ్లి) ముందు జంఝం, దర్భముడి వుంగరం ఇలా ఇచ్చెయ్యి.

కొండు : (జంఝం తీసి యిచ్చి) యిదుగో జంఝంపోస దాఖలు చేసుకో -బ్రాహ్మడన్న వాడికి ప్రాణ సమానమైన ధనం యిదే. అది నీ పాలు చేశాను. అంతటితో వొదలి వేయి.

రత్నాంగి:వుంగరం ఇలా ఇయ్యి.

కొండు : నువ్వు నీతిమంతురాలవని పేరు పడ్డావు. బ్రాహ్మణ ద్రవ్యం అపహరిస్తావా? అవిషం విషమి త్యాహుః బ్రాహ్మస్వం విషముచ్చతే” అని వెయ్యి నోళ్ళతో శాస్త్రకారుడు చెప్పాడు. చదువుకున్న బ్రాహ్మణ్ణి కొంచం చెయ్యి తడిచేస్తావేమో అని ఆశపడితే అసలుకి మోసం తెస్తూన్నావేమిటి?

రత్నాం : అధిక ప్రసంగం ఆలస్యానికి హేతువ! మన మాటలు విని ఎవరైనా వస్తే గుట్టు బట్టబయలవుతుంది... వుంగరం! ....

కొండు : కానియ్యి! నా వేలు వుంగరం నీ మృదువైన వేలు అలంకరిస్తే కృతార్థత చెందుతుంది. (వుంగరం అందిచ్చును.)

రత్నాం : ఆ మాట బాగుంది. (వుంగరం వేలునుంచుకుని) యిక శిఖ వుండిపోయింది. (తలవంచి ఒక నిమిషం కదలకుండా వుండి మొలలోంచి కత్తితీసి చూపించును. )

కొండు : (జుత్తు చేత పట్టుకుని) సిగకే తాళం పట్టావు? అదిమాత్రం వొదిలే, నీకు దాసుణ్ణై తిరుగుతాను. యెన్నడైనా నీ మాట గడువు దాటితే అప్పుడే యీ మర్యాద చేతువు గాని.

రత్నాం : “శుభస్య శీఘ్రం” అన్నాడు.

గురుజాడలు

493

కొండుభొట్టీయము