పుట:Gurujadalu.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండు : నేను పరాయివాణ్ణి కాను - నేను శాక్తేయుణ్ణీని. వామాచార తత్పరుణ్ణిన్ని - నా దగ్గిర ప్రభువు వారు అరమరవుంచవద్దు - రండి - ప్రభువు వారు దయ చెయ్యండి. సామాను వెనుక నుండి తీసుకువస్తారు.

టిక్కెట్టు కలెక్టరు: (ప్రవేశించి) కొండుభొట్టు చెయ్యి పట్టుకు లాగి - ఫస్టుక్లాసు బండీలోంచి దిగుతూ వుండగా నేను కళ్ళార చుశాను.

కొండు : అది యెవర్ని చూచి నేననుకున్నావో - వొంటి మీద చెయి వెయ్యకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి - నీ మీద డేమేజీ దావా తెస్తాను. (కొండుభట్లు త్రివిక్రమ రావు గారి వేపు తిరిగి) చిత్తగించారా ప్రభువు వారు యీ మూర్ఖుడికి యింగ్లీషున నాలుగు చివాట్లు రానియ్యండి శ్రోత్రియుణ్ణైన బ్రాహ్మణ్ణి అమాంతముగా ముట్టు గుంటారు! తల పగిలిపోతుంది.

టిక్కెట్టు : యీ కబుర్లెందుకు పదండి ష్టేషన్ మేష్టరు దగ్గరకి.

కొండు : పద, నాకేం భయమనుకున్నావ యేమిటి? (త్రివిక్రమరావు పంతులుగారితో) యిప్పుడే వస్తాను. తాము వొక్క నిమిషం ప్రభువు వారు కుర్చీమీద కూర్చోండి. (రంగనాయకులు సెట్టి తొందరగా ప్రవేశించి కొండుభట్లు చెవిలో యేమో చెప్పును. కొండుభొట్లు ఆందోళన పడును. యిద్దరూ ప్రత్యేకము మాట్లాడడముకు ఒకే ప్రక్కకు వెళ్లిపోదురు.)

టిక్కెట్టు క. : యెక్కడికి వెళ్ళుతావు ష్టేషను మాష్టరు దగ్గరకి రా!

శెట్టి : ఏమిటీ అల్లరి

కొండు : నేను ఫష్ణు క్లాసులో కూచున్నాని ప్రాణం పుచ్చుగుంటున్నాడు.

శెట్టి : యెళ్ళు! బాపనోళ్ళ మీదే నీ ఝంకారమంతాను. యింద! సుట్ట ముక్కలకి (అని ఒక అణా చేతితో పెట్టును. )

కొండు : కొంప ములిగింది. హఠాత్తుగా చచ్చింది, ముండ! యింత వేగం ఛస్తుందని నే నెరుగను. లేకుంటే వూరు దాటుదునా? అయితే మంజువాణిని ఎవరయినా ఆదుకున్నార? ఆమెకు యెవరు భరాసా యిస్తూన్నారు... నువ్వు వెళ్ళావు కావు.

శెట్టి : అంతా రత్నాంగే. మరెవరు నేను వెళితే కట్టి పట్టుకుని వెంట తరుముతుంది.

కొండు : అయితే మనకేం చెయిజిక్కదు కాబోలు.

శెట్టి : సిక్కకేం! మీరు బేగెల్లి సుళువు చెయ్యండి.

కొండు : యేం సుళువు చెయ్యడం ? బుద్ధిమాల్ని వెధవని. నాలుగు రాళ్లకి ఆశపడి రామసానికి అంత జబ్బుగా వున్నప్పుడు వూరు విడిచివెళ్లేను.

గురుజాడలు

486

కొండుభొట్టీయము