పుట:Gurujadalu.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పార్వతి : (మాట్లాడదు. )

రామ : (వెంట్రుకలు సవరించి, ముద్దు పెట్టుకొని చేతులు కట్లువిప్పి) యెవరు నీకీ అవస్థకి కారణభూతులు.

పార్వతి : వెంకడు.

రామ : వేధవని యెముకలు విరగదంతాను.

(యిద్దరూ నిష్క్రమింతురు)

కొండుభొట్టీయము

ద్వితీయాంకము

చతుర్ధ రంగం

(పొడుం దుకాణం)

వెంకన్న: (పొడుం చేస్తూ ప్రవేశించును. )

రామమూర్తి : యెందుకురా వెంకా చేతులు కట్టావు?

వెంకన్న: యెప్పుడొచ్చావు రాముడూ? పరీక్ష ప్యాసయిందిరా?

రామమూర్తీ : దున్నపోతు. అడిగిన మాటకు జవాబు చెప్పవేమి?

వెంకన్న :(పొడుంకర్ర పడవేసి నిర్ఘాంతపోయి జూచును) యెందుకురా రాముడు యీ కోపము.

రామ : పార్వతి చేతులు కట్టినందుకు ఇదిగో, పూనితీసి వో లెంపకాయ (అని కొట్టును)

వెంక : (బుగ్గ తడుముకుంటూ) యెవర్రా కట్టారు పార్వతి చేతులు.

రామ : నువ్వు కట్టావని చెప్పింది.

వెంక : నేను కట్టానని చెప్పిందా వెధవముండ.

రామ : వెధవముండని దాన్ని తూల్నాడితే మరో లెంపకాయ తీస్తాను.

వెంక : వెధవముండ కాకుంటే పునిస్త్రీ ముండనమంఛావురా! యీ మాటు లెంపకాయ తీస్తే ఆ మండ విరిచేస్తాను. విన్నావా..... ఒక దెబ్బకి మా రాముడివి కదా అని వూరుకున్నాను.

రామ : (పస్తాయించి) అయితే నువ్వు కట్టకపోతే దాని చేతులు ఎవరు కట్టారు ?

వెంక : అదేమో నాకేం తెల్సును. నెల రోజులాయి నేను యింటికే వెళ్ళలేదు.

గురుజాడలు

481

కొండుభొట్టీయము