పుట:Gurujadalu.pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంక : (అక్కాబత్తుడి దుప్పటి పట్టుకులాగి) నేను చెప్పుతాను. చెప్పుతాను.

అక్కా : (తిరిగి కూర్చుని) అయితే చెప్పండి.

వెంక : యెవరితో చెప్పరు గద!

అక్కా : యేమిటా మహా రహస్యం

వెంక : చెప్పరు గద - యిదిగో పార్వతి రాత్రి పడుకుంటే, మెల్లిగా లేపి మయిల బట్టలతో అట్లు తినమంది.

అక్కా : యిదా రహశ్యం, మైలబట్టలతో ఎందుకు తిన్నావు?

వెంక : (తలగోక్కుంటూ) పొడుం కొట్టు పెట్టుకోవడాన్కి పదిరూపాయిలిస్తానంది.

అక్కా : మరేమి! నీరొట్టి నేతిలో పడ్డది.

వెంక : నెయ్యి లేదు, వొట్టి రొట్టిలే పెట్టింది.

అక్కా : కొంప ములగడం?

వెంక : తను కొరికిన యెంగిలి రొట్టిముక్క తినమన్నది.

అక్కా : (నవ్వి) తిన్నావ?

వెంక : తిన్నాను.

అక్కా : (నవ్వు పట్టలేక మిక్కిలిగా నవ్వుతూ) రూపాయి లిచ్చిందీ?

వెంక : యిచ్చింది.... యిచ్చి....

అక్కా : యిచ్చి యేంచేసింది.

వెంక : మీదపడి కాగలించుకుంది. వెధవముండా అని తోసేసి అరుగు మీద వచ్చి పడుకున్నాను. ఆయంతా చీపురుగట్ట పట్టుకు వచ్చి వీపు పెట్లగొట్టింది. దాంతో మీ దగ్గరకు పారిపోయిచ్చినాను.

అక్కా : (నవ్వు పట్టలేక దొర్లును)

వెంక : యెందుకు నవ్వుతారేమిషి?

అక్కా : నవ్వక యేడవమన్నారేమిటి?

వెంక : నేను కూడా నవ్వనా?

అక్కా : అడిగి నవ్వుతారాయేమిటి? నవ్వు.

వెంక : (నవ్వును)

గురుజాడలు

479

కొండుభొట్టీయము