పుట:Gurujadalu.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ్మూ : ఆ శ్లోకాలు కట్టబెట్టి, నేం జెప్పే మాట వినండి.

“ప్రాప్తీషోడశ వర్షాణి పుత్రంమిత్రవ దాచరేత్” అన్నాడు

కొండి : (చిన్న రాగి జారీ చేతపట్టుకొని నిల్చి)

నా శాస్త్రం ముక్క నామీదికే విసురుతున్నావ్? ఆ చెప్పే మాటేదో చెప్పు. యిటు పైని నువ్ తండ్రివి నేను కొడుకునీనీ.

రామ్మూ: మీరు రాత్రి రామసానిపంచనో పంతులుగారి పంచనో తిని పరుంటారని మా గురువుగారితో అమ్మ చెప్పేసరికి నా వొళ్లు నీరు విడిచిపోయింది. మీరు సాందాని కొంపకి వెళ్లడవైనా మానాలి, నేను మీ యింట్లో అడుగు పెట్టడమైన మానాలి.

కొండి : (నిర్ఘాంతపోయి) యేమంటున్నావ్?

రామ్మూ: మీ ప్రవర్తన బాగుంది కాదు.

కొండి : మతిపోయి మాట్లాడుతున్నావేమిటి? బ్రాందీత్రాగలేదు కద?

రామ్మూ: అదొక్కటీ తరువాయుండిపోయింది. మీరు సాని యింట్కి వెళ్లడం నాకు యిష్టము లేదు.

కొండి : గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని... నీ యిష్టం యెవరిక్కావాలి. ముండయేడుపుసంత. యేదొమ్మరి గుడిసెలూ దూరకపోతే యే అకార్యాకర్ణాలు చెయ్యక పోతే నీకు బోలిడేసి డబ్బు పోసి చదువెలా చెప్పిస్తున్నాననుకున్నావు.

రామ్మూ: సానికొంపలు తిరిగి తెచ్చే డబ్బు పెట్టి నాకు చదువు చెప్పించక్కరలేదు.

కొండి : అయితే మున్సబీదాకా చదుకోవూ? నీయధాన్న యిదివరకల్లా బోశ్ని డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే? ఇది వరకు తిన్నది మాత్రం దుష్ట డబ్బు కాదా యేమిటి? అది ముందు వెళ్లగక్కి తరవాత శ్రీరంగ నీతులు చెప్పు.

రామ్మూ: మీరు మన యింటి పరువు తీసేస్తున్నారు.

కొండి : ఓరీ! నీ పరువుకు తండ్రినయినానుకాను, రాముడు దేవుడు కాడని, వెధవ ముండల్ని పెళ్ళి చేసుకో మనే కిరస్తానపు వెధవలకు సానింటికెళ్తే తప్పొచ్చిందీ. నీ పెళ్ళి కూడా సమీపించింది. కిరస్తానంలో కలసిపోవాలనుకుంటే యీలోగానే కలసిపో నీమేనమామ కూతురు కొంపెందుకు తీస్తావు.

రామ్మూ: కిరస్తానంలో యెంత మాత్రము కలియను నేను.

కొండి : ఈ తండ్రి మీద తిరుగుబాటంతా ఏమిటి.

గురుజాడలు

474

కొండుభొట్టీయము