పుట:Gurujadalu.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాంకము

చతుర్ధ రంగము

(కంసాలి దుకాణం)

(అక్కాభత్తుడు, కొండిభొట్టు ప్రవేశింతురు.)

కొండి : అక్కాభత్తుడు గారూ? దయలేదు గదా..

అక్కా : బ్రాహ్మణోత్తములు తమదయ మాకుండ వలెను గాని మా దయ యేమిచెరితార్థం?

కొండి : విశ్వకర్మలనగా సాధారుణులండీ. పురుష సూక్తంలో యేమి చెప్పాడో విన్నారా. “విశ్వకర్మణ... పురుషుణ్ణీ” అనగా ఆపరమాత్ముడ్నే త్వష్ట అనే కంసాలి చేశాడుట.

అక్కా : అలా అయితే బ్రాహ్మల కన్న కంసాల్లు యెక్కువే గదా?

కొండి : సందేహమేమిటండి. అందుచేతనే కంసాల్లు బ్రాహ్మలకి దండం పెట్టరు. వక్కహక్కు మాత్రం బ్రాహ్మణులకు వుండుకున్నది. కంసాల్లకి గాని యితర వర్ణాలకి గాని లేదు.

అక్కా : అది యెషువంటిదండి?

కొండి : గొప్ప చెప్పుకోవలసినది కాదు. అది యేమిటంటే "ప్రతి గ్రహణం” తెలిగిస్తే, ముష్టి యెత్తుకోవడమన్న మాట.

అక్కా : గడియకపోతే అది అందిరికీ వున్న హక్కే

కొండి : గడిచినా బ్రాహ్మడ్కి తప్పదు. నూరుకోట్ల రాజ్యాలేలే శ్రీమంతుడ్కి తప్పింది కాదు.

అక్కా : అది యేలాగేమిటి.

కొండి : చిత్తగించారా? అహల్యాబాయి అని హోల్కారు మహారాజులుంగారి భార్య వుండేవారు. ఆవిడకి కోట్లతో ధనమువుండేది. ఆ మహారాణీ బహుదొడ్డ పుణ్య కార్యాలు చేశారు. కాశీలో ఒక ఘట్టం కట్టించారు. సత్తరువు వేశారు. చిత్తగించారా! ఒకనాడు శ్రీమంతుల వారికి ద్రవ్యం కావలశివచ్చినది. అహల్యా బాయి గారిని దోచుదామని వెళ్ళేసరికి ఆ మాట తెలిసి అహల్యాబాయి గారు యేం చేశారంటె ధనమంతా కుప్పపోసి స్నానం చేసి, పట్టు వస్త్రాలు ధరించి తులసిదళం జారీ చేత్తోపట్టుకొని శ్రీమంతులు రాగానే “మహారాజా! దోచడానికి యేమి అవసరముంది. మీరు బ్రాహ్మణ మహారాజులు. ఈ తులసిదళం రెండు నీళ్ళ చుక్కలుతోటి నా యావత్తు ధనం పరిగ్రహించవలసినది. యింత పాత్రతయిన దానం యెలా లభిస్తుంది” అని ఆ మహారాణి అన్నారుట.

అక్కా : సరేకాని అపాత్ర దానంవల్ల దోషం లేదా?

గురుజాడలు

469

కొండుభొట్టీయము