పుట:Gurujadalu.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండుభొట్టీయము

ప్రథమాంకము

ప్రథమ రంగము - మంజువాణి యిల్లు.

(మంజువాణి తలదువ్వుకొంటూ కుర్చీపైని కూర్చుండును. కొండిభొట్లు ప్రవేశించును.)

మంజు : దండం శాస్తులుగార్కి వెంకీ : శాస్తులు గార్నికూర్చోబెట్టి పీటవెయ్యే.

కొండి : సకలైశ్వర్య సిద్ధిరస్తు. పంతుళవారు పాదాక్రాంతాభవంతు... ఆ తలవెండ్రుకలు సాక్షాత్తూ చమరీవాలాల్లాగ శోభిల్లుచున్నాయి. విన్నావా మంజువాణీ!

మంజు : యింకా యేవి యెలా వున్నాయి?

కొండి : యేదిన్ని వర్నించడానికి సెఖ్యం కాకుండా వున్నాయి... ముఖం చందబ్రింబంలా వున్నది. కళ్లు కలవరేకుల్లా వున్నయి. గళం శంఖంలా వున్నది. బాహువులు లతల్లా వున్నయి. మరెవచ్చీ....

మంజు : మరెవచ్చి అక్కడ ఆగండి.

కొండి : మంజువాణీ! అదికం యేల. నీ సౌందర్యం, రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమాదుల్ను ధిక్కరించి వెక్కిరించియున్నది.

మంజు : మా పంతులుగారి వెధవ అప్పగారి సాటి యేమాత్రమయ్నా వస్తుందా?

కొండి : హాశ్యానికైనా అనగూడని మాటలున్నాయి (పొడుం పీల్చును. )

మంజు : చెయ్యగాలేంది చెప్పడమా తప్పొచ్చింది.

కొండి : దేవతలు బ్రాహ్మలు చేసే పనులు తప్పు పట్టకూడదు. స్వర్గంలో వాళ్లు దేముళ్లయితే, భూలోకంలో మేం దేముళ్లము; అంచేతనే మమ్మల్ని భూసురులంటారు. చదువుకున్న దానివి నీకు తెలియందేమున్నది.

మంజు : వెధవల్ని తరింపజేసే భూసురోత్తములకు నమస్కారము (నిలుచుని నుదుట చేతులు మొగిడ్చి నమస్కారము చేయును.)

(భీమారావు పంతులు ప్రవేశించును.)

గురుజాడలు

463

కొండుభొట్టీయము