పుట:Gurujadalu.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 రణ : తమవంటి మహాకవులవల్ల కృతి పొందడముచేత అమాత్య సంపత్కరుల జన్మ సఫలమైనది. ఆ మహాపురుషుడు అసమాన ప్రతిభావంతుడు, దయాళుడు, ప్రభు విశ్వాసపాత్రుడు; మరిన్నీ ఈ రాజ్యానికి కాలగతి చేత వలస వచ్చిన మమ్మును కాపాడుతున్న పరమ మిత్రుడు. తమ పొగడ్తకు తగినవాడేగానీ జైనుడు కాకుంటే యంతో బాగుండును కదా అని అనుకుంటాను.

బిల్హ : (చిరునవ్వు నవ్వి) ప్రభువు నమ్మిన బంటయి, మిమ్మల్ని కాపాడుతున్న మిత్రుడై, లోకోపకార ధురీణుడైనప్పుడు ఆయన మతం మీకు ఎక్కడ అడ్డు వచ్చెను కుమారా?

రణ : సకల సద్గుణ సంపన్నుడు గదా, మతం గూడా మంచిదైతే, చంద్రుడికి కళంకం లేనట్లు వుండును గదా అని నా మనస్సున కొరత.

బిల్హ : కుమార, నిజమైన జ్ఞానమును సాధించవలెననే అభిలాష గల మీబోటి పండితులకుపర మతములయందు అసూయ వుండకూడదు. ఈ భూ ప్రపంచమందు లెక్కలేని మతాలు వున్నవి. అన్ని పేరెక్కిన మతములలోనూ పండితులూ, సత్పురుషులూ కలరు, అన్ని పేరెక్కిన మతములలోనూ సంసారమును తరించే సాధనములు కలవు. ఆయా సాధనములను అవలంబించి ప్రాజ్ఞులు ధర్మమార్గానువర్తులై, సదా లోకోప కారపారీణులై ఆయా మతములకు వన్నె తెత్తురు. అందుకు అమాత్య సంపత్కరులే దృష్టాంతము. అఫ్రాజ్ఞులు ఆత్మలాభమునే ఆపేక్షించుచు అట్టి లాభము సమకూడుటకు వంకర తోవల నడిచి, తామసులై పరులను పీడించుచు జీవికలేని జప తపాదులను చేయుచు లోకమును, దేవుడినికూడా మభ్యపరుప యత్నింతురు. అట్టివాడు నానా మంత్రి. పేరుగల మతమల్లా సత్ప్రవర్తనను, భూతదయను ముఖ్యములని చాటు తున్నవి. వైదికమతములకన్న బౌద్ధ జైనమతములలోనే వీటికి ప్రాముఖ్యత లావు. సత్ర్పవర్తన అనేది ఆత్మకు కవచము. భూతదయ అనే ఉపాసన ప్రత్యక్ష స్వర్గమై సద్యో ఆనందదాయకము, నిర్వ్యాజమైన ఈ గుణములతో మేళనలేని జపతపాదులు వ్యర్థములు. మనస్సుయొక్క దుర్వృత్తులను మళ్ళించడం అల్ప బుద్దులకు సాధ్యంకాదు. ముక్కు బిగించుకు కూచొనుట ప్రతి కొంగకూ సాధ్యమే. గాన వైదికుడైన నానామంత్రి కన్న, జైనుడైన సంపత్కరులే శిష్టు. నాలుగు దేశాలూ తిరిగి నాలుగు దేశాలవారి తోడనూ అన్నదమ్ములవలె బతికిన వాళ్ళకు మతాభిమానాలు మాసిపోతాయి. బుద్ధికి సంకెళ్ళు విడిపోతాయి.

రణ : జైనులు వేదబాహ్యులు గదా అని.

బిల్హ : ఆ మాటకు వస్తే మన దర్శనాలు అన్నీ వేద ప్రామాణ్యమును సరిగ్గా వొప్పుకున్నవా? వొప్పుకున్నవి మాత్రం వక్క రీతినీ వొప్పుకున్నవా?

గురుజాడలు

455

బిల్హణీయము