పుట:Gurujadalu.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 చదివి) ఇది నానామంత్రిగారి కవిత్వం కానోపును. (రెండవ పత్రం చూసి, ఆశ్చర్యపడి) యిది యిక్కడి కెలావచ్చింది?

కేశవ : యేమిటండి ఆ పత్రం?

బిల్హ : (ప్రత్యుత్తర మియ్యక) ఇక్కడ కేలావచ్చెను, యీ పత్రం?

నారా : చెప్పవద్దని నానామంత్రిగారు, నా చేత ఘోరమైన ప్రమాణం చేయించారు.

నానా : (బిల్హణుడి చేతులు తన చేతులతో పట్టుకొని) క్షమధ్వం! క్షమధ్వం!

బిల్హ : “క్షమధ్వం”, యేమిటి, నీ శ్రాద్ధం!

నానా : నా వల్ల గట్టి పొరపాటు వచ్చింది. క్షమించండి. తమవంటి మహా పండితులకు, ఆగ్రహవఁన్నది వుండదు. యీ శ్లోకం కాశ్మీర మహారాజులు వుంచిన వేశ్యను ఉద్దేశించి తాము రచించినారని తమ శిష్యుడొకడు తెచ్చి నాకు చూపించాడు. దాంతో నాకు అనుమానం కలిగిన మాట సత్యం. అనుమానం కలిగి తమతో సంబంధం వొదులు కొమ్మని, నారాయణభట్టుగారితో నేను చెప్పిన మాటా సత్యమే. వారి మంచికోరి ఆలా చెప్పాను. అంతేగాని మీకు అపకారం చేదామని కించిత్తు అయినా నా అభిప్రాయం కాదు. ఆ సోమనాథుడు సాక్షి. అబద్దవాఁడితే నా నెత్తి మీద ఆకాశవంతఁ పిడుగు పడిపొవాలి. తమవంటి మహానుభావుల విషయమై క్షుద్రులు చెప్పిన మాటలు నమ్మడం బహు పొరపాటు. కేశవభట్టుగారు యా వేశ్య కథ అంతా శుద్ద అబద్దవఁని యిప్పుడే శలవియ్యగా, “యెంతటి కబుర్లయినా పుట్టించే దుర్మార్గులు వుంటారని” ఆశ్యర్యపడ్డాను. వారి మాటంటే నాకు చాలా గురుతు. క్షమధ్వం అని తిరిగి ప్రార్థిస్తున్నాను.

బిల్హ : (ఇంత తడవు ఆలోచించి, తావళము నారాయణభట్టు మెడను తగిలించి) నేను వెళ్ళిపోయినదాకా అయినా, యిది మెడని వుండనియ్యండి. ఆ తరువాత యెలాగా మీకు దక్కదు. అప్పట్లో యీ దుష్టమంత్రికి యీ మహా హారమును అర్పించి ప్రాణం కాపాడుకోండి. శూరాగ్రేసరుడైన దాహలాధీశుని కంఠంనుంచి దుష్టాగ్రేసరుడైన ఈ కుమంత్రి కంఠమునకా! దేనికి యే కాలానికి యే అవస్థ వస్తుందో, కానలేం. (నానామంత్రి దగ్గరకు వెళ్ళి ముఖం మీద ముఖం వుంచి) నా మూలముగా అమాయకుడైన బ్రాహ్మడికి అపకారం చెయ్యకండి. మీ యందు నాకు ఆగ్రహం లేదు. అందుకు తగరు. అసహ్యం కద్దు. మీ కుట్రకల్లా లక్ష్యం నేను యీ దేశం విడిచి వెళ్ళడవేఁ గదా? మీరు అట్టే శ్రమపడకండి. వెంటనే వెళ్ళతలచినాను. ఆహా! యేమి దేశం! యేమి మనుష్యులు! (నిష్క్రమించును.)

గురుజాడలు

452

బిల్హణీయము