పుట:Gurujadalu.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కేశవభట్టు :(ముందుకు వచ్చి నిలిచి) ఈ అబద్ధాలు ఆడవలసిన అవసరమేమిటండి?

నానా : మరేం లేదు. నారాయణభట్టు ధనికులు కారు. పిల్లల వాళ్ళు. అక్కగారి వంటను అట్టే హంగులేదు. అందుచేత, యీ రుద్రాక్ష తావళం విక్రయించి, ఆ సొమ్ముపెట్టి బంగారం కోసమని నాకు అక్కగారి శలవు కాగా, కాసులుతెచ్చి అక్కగారికి యిప్పుడే దాఖలు చేశాను.

కేశవ : కావొచ్చును. కాని బిల్హణులతో కలియకపోవడానికీ, మాట్లాడకపోవడానికీ కారణ మేముండునో కొంచెం శలవు దయచేయిస్తారా?

నారా : వేశ్య మాట మీకు తెలియలేదు కాబోలు?

కేశ : వేశ్య మాట యేమిటండి?

నారా : బిల్హణులు, కలశ మహారాజులు వుంచిన వేశ్యతో స్నేహం లావు చేశారట. అందుచేతనే వారు దేశం నుంచి తోలివేశారట.

కేశ : ఏ దుష్ట యీ కల్పన కల్పించాడండీ! (నారాయణభట్టు నానామంత్రి వేపు చూసి వూరుకొనును.)

కేశ : (నానామంత్రితో) తమరు యిప్పుడు దయచేయించినన్ని కాసులు, నేను తమకు దాఖలు చేస్తాను, భట్టుగారికి నేను చాలా సొమ్ము బాకీ వున్నాను. రుద్రాక్షతావళం యొక్క విలువ అన్నది ఆ బంగారంలో లేదండి, ఆ మాల అమూల్యమైనది. అది యిలా దయ చెయ్యండి. వారి కంఠమందు తిరిగీ వుంచుతాను.

నానా : అలా గయితే నేనే వుంచుతాను. (మాల నారాయణభట్టు మెడ వుంచబోవును.)

కేశవ : తమకంత శ్రమెందుకూ? నేనే వుంచుతాను. (కేశవభట్టు మాలను పట్టుకుని తాను వుంచ ప్రయత్నించును.)

నానా : నేను వుంచితే తస్పా!

కేశవ : తమరు తగిలించవలసిన సూత్రం, యెప్పుడో ఒకప్పుడు మా అందరికీ వుండనే వుంది.

(కేశవభట్టూ, నానామంత్రి తావళంతో పెనుగులాడుతూ వుండగా తావళం తెగుననే భయంచేత, నారాయణభట్టు కూడా తావళం పట్టుకొనును. యింతలో బిల్హణుడు ప్రవేశించును. ముగ్గురూ పట్టువదలగా, తావళమూ, నానామంత్రి చేతి పత్రమూ,నారాయణభట్టు చేతి పత్రమూ, నేలపడును.)

బిల్హ : (తావళమును, పత్రములను యెత్తి) యేమిటీ దురంతం? ఈ పండితాగ్రేసరుడికి | యెట్టి పాటు వచ్చినది! యీ ఉత్కృష్ణమాలకు యెట్టి పాటు వచ్చినది! (ఒక పత్రము

గురుజాడలు

451

బిల్హణీయము