పుట:Gurujadalu.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారా : నా మీదే ఆగ్రహం! యేం, నాయనా! యేం, నాయనా! ఎన్నడూ యే పాపం యేరగనే!

నానా : మీ అంత అమాయకమైన బ్రాహ్మణ్ణి నేను ఎక్కడా చూడలేదు. ఊరందరికీ తెలిసిన మాటైనా మీకు తెలియదు.

నారా : నా వంటి బీద బ్రాహ్మడియందు ఆగ్రహానికి, కారణవేఁవిఁటి నాయనా?

నానా : వొక కారణం, స్త్రీలోలుడైన ఈ బిల్హణుడి సహవాసం చేస్తున్నారనే - రెండో కారణం, మీరు ఈ ఆస్థానంలో పండితులయి వుండిన్నీ బిక్షాటనం చేసే పరదేశ పండితుడివల్ల బహుమానం పరిగ్రహించడం, ఆ పరిగ్రహించిన తావళం మెడని వేసుకొని నిర్భయంగా తిరగడం. నేనంటూ, యెంతో దూరం మీ యోగ్యత, శ్రీవారి సమక్షంలో మనవి చెయ్యబట్టి, మీకు అట్టే హానిలేకుండా సరిపోయినది.

నారా : పిల్లలవాణ్ణి, మహరాజా, నా కొక హానిరాకుండా కాపాడండి. నాకు లౌక్యం తెలియదు. అయితే ఈ తావళం అతగాడికి పంపివేదునా?

నానా : అదికాదు కర్తవ్యం. మీకు సమ్మతవైఁతే నేనొక ఉపాయం చేస్తాను. రుద్రాక్షలు ప్రతి బైరాగి దగ్గిరా దొరుకుతాయి. వాటికి విలువేమిటీ! బంగారం యే మాత్రం వుంటుందో?

నారా : యిరవై తులాలు వుంటుందని, మా యింటి ఆవిడే అంది.

నానా : చూశారా, మొగవాళ్ళకంటె ఆడవాళ్ళకి యెక్కువ బుద్ధి వుంది. “క్షణశః కణశశ్చైవ విద్యా మర్థం చ సాధయేత్" అన్నాడు. యీ తావళం యెప్పటికైనా మీకు దక్కేది కాదు, గనక, ఆ యిరవై తులాల మీదా మరి నాలుగు తులాలు వేసి ఆ విలవగల కాసులు యిస్తాను; అవి పుచ్చుకొని అక్కగారికి ఒక కాసుల పేరు చేయించండి. రండి, అక్కగారితో ఆ మాట నేను స్వయంగా మనవి చేస్తాను.

(ఇద్దరును యింటిలోకి వెళుదురు.)

(అదే స్థలం) కేశవభట్టు ప్రవేశించి, యిటూ అటూ, చూచి, ఎవరినీ కానక ఒక మూలకు కూచుని పుస్తక పత్రాలు తీరగవేస్తూ వుండును. కొంతసేపటికి రుద్రాక్ష తావళమూ, ఒక పత్రమూ, పట్టుకుని, నానామంత్రిన్నీ, సంతోషంగల ముఖంతో నారాయణ భట్టున్నూ ప్రవేశింతురు. వీరు మూలకూచున్న కేశవభట్టును చూడరు. )

నానా : ఇటుపైని బిల్హణుడితో కలియకండి. మాట్లాడ్డం కూడా తప్పించుకొండి. రుద్రాక్ష తావళం యేమైపోయిందని యవరడిగినా, పోయిందనండి. రాజడిగితే అమ్మేశాననండి.

గురుజాడలు

450

బిల్హణీయము