పుట:Gurujadalu.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 శిష్యు : ఔనండి.

నారా : ఇక పద్యం యెలా అల్లాడో చూదాం....'అంకం' అనే ఒక మాట తీసుకున్నాడు. దానికి అనుప్రాసార్థం 'పంకం' అనే మాటొకటి యెత్తాడు... అటుపైని “ఆ అంకానికీ, యీ పంకానికీ, యెలాగయా అతకడం?” అని ఆలోచించి యేం యెత్తు యెత్తాడంటే, పంకం సముద్రంలో వుంటుంది గదా, చంద్రుడున్నూ సముద్రంలోనే పుట్టాడు గదా, ఆ పుట్టడంలో బురద యేమాత్రమైనా వొంటికి అంటకుండా వుంచ్చుందా అని యోచించి, అంక పంకాలకి లంకె వేశాడు. అంతే కదూ?

శిష్యు : అంతేనండి.

నారా : సరేగానీ, బురదంటూ వొకవేళ తగిల్నా, యెవడయినా కడుక్కోడ్రా? యిదంతా అసందర్భం చాలా కానవస్తూంది.

శిష్యు : అవునండి.

నారా : అయితే మనక్కూడా వొక ప్రాసముక్క చూచిపెట్టు; శ్లోకం అల్లుదాం.

శిష్యు : ‘శంఖం' బాగుందండి.

నారా : బాగుంది. అయితే శంభానికీ, చంద్రుడికీ, యెలాగరా అతకడం?

శిష్యు : యలాగనా అండి తెలుపు గనుక ఉపమానం చేద్దాం.

నారా : అంకం, వొకటి తగలడుతూంది కదూ! శంఖానికి కళంకమేదీ?

శిష్యు : కొంచెం మసిపూస్తే, కళంకం సాధ్యమౌతుందండి.

నారా : ఓరీ, మూర్ఖుడా! శంఖం పనికిరాదు. మరో మాట చూడు.

శిష్యు : శంకా.

నారా : శంకా?... శంకా?... శంకా... కళంకానికి, శంకేలా తగిలించడంరా? ఆఁ, కుదిరింది, రాయి.

(నారాయణభట్టు చెప్పును. శిష్యుడు రాయును. )

“అంకం కిమితి శశాంకే |
కథమిహ నౄణాం విజాయతే శంకా11

“శశాంకుడిలోవున్న మచ్చ యేమిటని మనుషులకు శంక యేలాగు పుట్టగలదు?” మహాబాగా వొచ్చిందిరా, శ్లోకం! యేవఁంటావు.

గురుజాడలు

446

బిల్హణీయము