పుట:Gurujadalu.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నానా : ఇటుపైని అనుదినం తమకు పళ్ళు పంపి మరీ అమ్మాజీవారికి పంపుతాను. మన తండ్రులు స్నేహితులైనందుకు, యీ నాటికి తిరిగీ మనం కూడా స్నేహితులం కావడము కేవలము భగవత్సంకల్పంగాని ఒండుకానేరదు.

బిల్హ : కృతార్థుడను. స్నేహంయొక్క విలువన్నది దేశదేశాలు తిరిగే మా బోటి పండితులకే తెలుసును.

నానా : యిక్కడ వున్నంతకాలం మీకు యే సహాయం కావలసినా అరమరలేక, ఈ మిత్రుడివల్ల పుచ్చుకొండి. అమ్మాజీవారి ఆగ్రహం మీయందు వున్నప్పటికీ నా ప్రాణం వున్నంతవరకు, మీకు అడ్డుపడతాను.

బిల్హ : నా విషయమై ఒకరికి హాని రాకూడదు. యేమి ఆ ఆగ్రహ కారణము?

నానా : మహారాజ కుమారికా వారికి తాము విద్య చెబుతారనే

బిల్హ : మహారాజువారి మనస్సు మళ్ళించలేరో?

నానా : వారిక్రోధం అనివార్యం.

బిల్హ : తమ సలహా యేవిఁటి?

నానా : యేం జెప్పను? యెప్పటికైనా వారివల్ల మీకు హాని వుంది. రాజుల క్రోధాలు మహ చెడ్డవి. దేశం విడిచి వెళ్ళిపోవడం వక ఆలోచన. మీరు యెక్కడికి వెళ్ళినా రారాజులు నెత్తిన పెట్టుకుంటారు గాని, మీరు వెళ్ళిపోతే ఆ దురదృష్టం ముఖ్యంగా నాది. కుమారికా వారితోపాటు నేను కూడా తమవద్ద భగవద్గీతలు నేర్చవలేననుకున్నాను.

బిల్హ : నావల్ల భగవద్గీతలు వింటే, మీరు ఉద్యోగం మానుకుంటారు. మహారాజకుమారికా వారు వివాహం మాని, సంసారం పరిత్యజిస్తారు.

నానా : నేను నాలుగు యేళ్ళాయి ఉద్యోగం చాలించుకుని, భగవంతుడి శేవలో కాల వెళ్ళబుచ్చుదావఁనుకుంటున్నాను. నేను ఉద్యోగంలో వుంటేనే గాని రాజ్యానికి ఆపాటం వస్తుందేమో యని మహారాణీవారైతేనేమి, మహారాజు అయితేనేమి నన్ను నిర్బంధిస్తున్నారు.

బిల్హ : మీయందు మాతా మహారాణీవారికి అంత వాత్సల్యత ఉండగా నాకు హాని రాకుండా మీరు వారిని మళ్లించలేరో?

నానా : మహాపండితులూ, మహాకవులూ! తమకు నేను జెప్పవలశిన ధర్మాలు కలవా? రాజులు తాచుపాములు! పట్టుదలే గానీ లాభనష్టాలు గణించరు.

గురుజాడలు

444

బిల్హణీయము