పుట:Gurujadalu.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 కృష్ణ : నీకు వున్నట్టుంది కర్ణ పిశాచి. యెక్కడలేని రహస్యాలూ యెక్క లాగుతావు.

కర్ణ : (బిల్హణుని ఉద్దేశించి) కవి వర్య! అజ్ఞానానికి అంజనం యేమిటి?

బిల్హ : రాజ పదవికి నైసర్గికమైన మహాంధకారమును తొలగించి, నిశ్చలమైన జ్ఞానోదయము వల్ల అరిషడ్వర్గమును తలచూప నివ్వకుండా తరిమిన తమవంటి సత్పురుషుల సహవాసమే అజ్ఞానాంజనము మహారాజా! పండిత సామాన్యమునకు విద్యన్నది జ్ఞానసాధకంకాక, మాత్సర్యహేతువై యేయుండును.

విదూ : నానామంత్రిగారి అభిప్రాయమూ అదే. వారు మట్టుకు సాధనం లేకుండానే సాధ్యం సాధించారు.

కర్ణ : జ్ఞానాలోకమునకు ఉత్పత్తి స్థానము సూరులు. ఆ సూరుల సంసర్గంవల్ల నృపనామక పాషాణములకు కూడా కాంతి ఆపాదన ఔతుంది. నాకుగల స్వల్పజ్ఞానము అమ్మాజీ వారి శిక్షవల్లనూ, మహా పండితుల సహవాసమువల్లనే కలిగినది. స్వామి మాకు బాల్యగురువులు. యిప్పుడు తాము అందరూ మాకు గురువులే. (మంత్రితో) మంత్రి వర్యా! రేపటి నుంచి బిల్హణ కవులు మహారాజ కుమారికా వారికి గీతోపదేశం చెయ్యడముకు అభ్యంతర మేమీ?

నానా : అభ్యంతరం అనగా అభ్యంతరం యెందుకుంటుంది మహాప్రభో!

కర్ణ : అయితే అమ్మాజీ వారితో విన్నవించి వస్తాము. (లేచును.) (అందరు లేచుచుండగా)కూచోండి! పెద్దలకు శ్రమయేల? (నిష్ర్కమించును).

(పండితులు చెదిరి గుంపులు గుంపులుగా మాటాడుదురు. )

నానామంత్రి : (మాధవశర్మతో) అడ్డంగా తిరిగిందే!

మాధవశర్మ : అదే నేనూ యోచిస్తూన్నాను. ప్రవాహానికి యెదురీది ప్రయోజనం లేదు.

నానామంత్రి : అయితే వాడితో కలిశిపోతానంటారా యేమిటి?

మాధవ : ఆడుకొమ్మా, పట్టుకొమ్మా కనపడనప్పుడు యేం జేయను?

నానా : మీరు భయపడక నిలబడి మాత్రం వుండండి వీడికి ఉచ్చాటనమంత్రం మహారాణీ వారితోటి వుపదేశం చేస్తాను. చూడండీ, ఆ స్వామి, వాడితో యెంత ఆసక్తితో ముచ్చటిస్తున్నాడో! మన వాళ్లలో కట్టు లేదు.

మాధవ : పండితులు కుక్కల్లాగ కాట్లాడబట్టేకదండీ, పరాయివాళ్ళు డబ్బు తన్నుకుపోతున్నారు! (బిల్హణుడున్న తావుకు వెళ్ళును.)

గురుజాడలు

442

బిల్హణీయము