పుట:Gurujadalu.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 విదూ : భగవద్గీత కాశీలోనూ, కాంచీపురంలోనూ అభ్యసించిన పంతులు వారికి కోపవెఁందుకు వుంటుంది? అయినా నిజవైఁన మాటకు కోపవెఁందుకు?

కర్ణ : నిజమనేది యెట్టిదో?

విదూ : అనుదినం భగవద్గీత పారాయణం మట్టుకు చేస్తూవుంటే, ఆడే అబద్దాలల్లా నిజ వౌఁతాయి. ఇది వక శుద్ధక్రియ.

నానా : యేమిటీ యీ మాటలకి అర్థం.

కర్ణ : విదూషకుడి మాటలకు అర్థం ఆలోచిస్తారేమిటి?

కృష్ణ : కొందఱికి అతగాడి మాటలు ఆలోచించినకొద్దీ అర్థాలిస్తాయి.

నానా : వెఱ్ఱికి వేయి అర్థాలు.

విదూ : కేశవభట్టుగారిని ఒక వెఱ్ఱి ధర్మసందేహం బాధిస్తూంది. ఆయన వెఱ్ఱి తీర్చి, తరువాత నా వెఱ్ఱికి వైద్యం చేతురుగాని.

(కర్ణమహారాజు కనుబొమలెత్తి కేశవభట్టును చూచును.)

కేశవ : నిజం విచారించి మరీ శిక్ష విధించటం ధర్మశాస్త్ర పద్ధతేమో యని సర్వజ్ఞులున్నూ, ధర్మస్వరూపులున్నూ అయిన యేలికల సమక్షమందు యంతో భయంతో మనవి చేసుకుంటున్నాను.

కర్ణ : యెంతమాటంటిరి; భయమేల? నేను రాజు నైనను, కించజ్ఞుడను. రాజు నౌటనే కించజుడను అని అనవచ్చును. పండితులు, ప్రాజ్ఞులు వారి వారి నమ్మకములను నా యెదుట ముచ్చటించుటకు వెరచిరేని, నేను రాజ్యమునకు అర్హుడనే కానే?

కేశ : రాజాధిరాజ! పండితరాజను శబ్దము యేలినవారికే చెల్లేను! గ్రంథములు నెత్తిని మోయుటకు అస్మదాదులము కూడా మహాపండితులమే. అయితే, మోతచేటే గాని, వాటి గంధము ఆత్మలకు అంటక, చదువులు ఒక తెన్నూ చర్యలు మరవక తెన్నూ అయి, కామ లోభాదులచే జ్ఞానాంధులమైన మా బోట్లకు, పండితశబ్దము యెట్లు చెల్లును? లోకము పరిత్యజించి అడవుల్లో తపస్సుచేసే మునులకయినా లొంగని క్రోధాదులను నిర్జించిన యేలినవారే పండితులుగాని, ఈర్ష్యతీర్చుకొనుటకుగాను నిజమును కప్పి, ధర్మమును దాచి, అల్పమైన ఐహిక లాభముల నపేక్షించే, మేమా పండితులము మహారాజా?

కృష్ణ : యీ ముక్కలేమో యెవరికీ తెలియనట్లు ఉపన్యసిస్తూన్నారు. రెండు కళ్ళతోనూ చూశామయ్యా, అని ఘోషిస్తూ వుంటే, అట్టి బలవత్తరమైన సాక్ష్యాన్ని మీ పండిత

గురుజాడలు

439

బిల్హణీయము