పుట:Gurujadalu.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 ప్రవర్తిస్తేనే గాని విద్య పెరగదు. అమ్మాజీవారికి భగవద్గీతయందు మంచిప్రవేశము కలదు. మీరు మనవి చేస్తే మహారాజకుమారికావారికి కూడా ఆ గ్రంథరాజమును చెప్పించుటకు వప్పుదురేమో!

నానా : శలవయితే మనవి చేస్తాను.

కర్ణ : మీరు మనవిచేస్తే, వారు ఆమోదించడముకు అభ్యంతరం వుండబోదు. గాని బిల్హణులు వెళ్ళిపోతే, యెవరిచేత ఉపదేశం చేయింతుము!

నానా : మన పండితులు దిగ్దంతులు, యవరైనా చెప్పగలరు.

కర్ణ : లోకానుభవమూ, బోధకతా శక్తీకలవారు మీ రేల చెప్పరాదు?

నానా : ప్రభువుల శలవైతే, తప్పకుండా చెప్పుతాను. మాధవశర్మగారి సహాయం వుండనే వుంటుంది.

మాధవ : ఆహా.

కర్ణ : అయితే అమ్మాజీవారితో మనవిచేశి వత్తురా?

నానా : చిత్తం. మనవిచేసి, యిప్పుడే తిరిగీ హాజరవుతాను (నిష్క్రమించును)

విదూ : యేమి చిత్రమైన లోకమూ!

కర్ణ : కొత్త చిత్రం యేమి కనపడ్డది?

విదూ : నేను ఒకణ్ణి తప్ప, లోకంలో మరి యెవడికీ తన అవస్థతో సంతుష్టిలేదాయ?

కర్ణ : యెలాగో?

విదూ : పండితులకి ఉద్యోగాలు చెయ్యాలని తాపత్రయం. ఉద్యోగస్తులకు పండితులనిపించుకోవాలని తాపత్రయమూను.

కర్ణ : మామాటో?

విదూ : తమమాట చెప్పనేల? అంతా యెరిగినదే! నా పదవిమీద మీరు కన్నువేశారు.

కృష్ణ : మొదటికే తెచ్చావూ!

విదూ : రామ శబ్దంరాని నానామంత్రిచేత, గీత ఉపదేశం చేయించడానికి తమరు తల పడ్డప్పుడు, నా బిరుదులు నేను తమకు సమర్పించక తీరదు గదా? (మహారాజు విదూషకుడి చెవిలో రహస్యము చెప్పును. విదూషకుడు టొంకరి నడకతో నిష్క్రమించును)

గురుజాడలు

436

బిల్హణీయము