పుట:Gurujadalu.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 కృష్ణస్వామి : నిజమైన పండితుడికి ప్రభువులయందే లక్ష్యం ఉంటుందిగాని, ఉద్యోగస్తుల యందు లక్ష్యం యేల వుండును?

రామ : ప్రభు లక్ష్యమే లేని పండితులకు, ఉద్యోగస్తుల లక్ష్యవెఁలా వుండును?

నానామంత్రి :బిల్హణుడు ప్రభువులను కూడా లక్ష్యపెట్టడా? మహాప్రభువు వారిని గూర్చి చులకనగా ప్రశంశించెనా? యేమిటి అంతవాడూ అవును!

మాధ : ప్రశంస అని ప్రశంస కాదు. ప్రభువులు చేసిన సన్మానాన్ని నిరాకరించారని కాబోలు. రామశాస్త్రిగారి భావం.

కర్ణమహారాజు : అదెలాగ?

కృష్ణ : మరేమీలేదు; యేలినవారు దయచేసిన రుద్రాక్షమాల, పదిమంది పండితులలోనూ, నారాయణభట్టుగారి మెడను వేశారు (రామశాస్త్రీతో) అదేకదండీ మీరనబోయే మాట?

కర్ణమహారాజు : (కనుబొమ లెగయ యోచన నటించి) అలాగనా స్వామీ?

కృష్ణ : నా కళ్ళతో చూశాను.

నానామంత్రి : ప్రభువులు, వచ్చిన దాసరినల్లా మెచ్చి, హారాలూ, అందలాలూ, యిస్తూవుంటే, వాళ్లు నిరసించడం ఆశ్చర్యమా!

విదూ : ప్రభువుల శలవైనప్పటికీ, ఒక కాచవైఁనా యివ్వకుండా మీరు కలకాలం తిప్పుతూ వుంటే, ప్రభువులు వొళ్లువొలిచి, హారాలూ, అంగదాలూ, యివ్వవలిశి వొస్తుంది. ఇదే మీలాటి మంత్రులు ప్రభువులకు చేసీ కూడిక.

కర్ణమహా :మంత్రివర్య, బిల్హణకవి ఇట్టి పనిచేస్తారని మేము తలచి యుండలేదు.

నానామంత్రి : దేశదిమ్మరి! తరతరాలనుంచి కనిపెట్టుకున్న వాళ్లకి వుంటాయిగాని యేలినవారి యెడల భక్తి విశ్వాసాలు, అట్టివాడికెలా వుంటాయి?

కృష్ణ : బుఱ్ఱకు విలవ తక్కువ అనండి. స్వదేశి అయితేనేం, పరదేశి అయితేనేం?

నానా : కాకుంటే, తనతలేవిఁటి, ప్రభువులు తనకిచ్చిన అమూల్యమైన హారం, తానంటూ మరివక పండితుడికి బహుమానం చెయ్యడవేఁవిఁటి?

కర్ణ : యింకా బిల్హణులచేత మహారాజకుమారికలకు చదువు చెప్పించవలెననుకుంటిమి. ఈయన ప్రవర్తనకు తగిన ప్రతిక్రియ యెద్ది?

విదూ : తన్ని తగిలివెయ్యడం.

గురుజాడలు

434

బిల్హణీయము