పుట:Gurujadalu.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 గలిగిన వారిని వకరిని, అచ్చుబోసి వదిలితేనే గానీ, మనను గూర్చి లోకం యేమనేదీ మనకి తెలియబోదు, యేమంటారు?

కృష్ణ : సత్యం! సత్యం! పునస్సత్యం!

రామ : మహారాజా, ఉచ్చావస్థలో నున్న ప్రాజ్ఞులు మంచి చెడ్డలు యెరగకనా సంచరిస్తారు? మంచిచెడ్డ లన్నవి అంతకన్న లోకులకు, బాగా తెలియగలవు ?

విదూ : భర్తృహరి ప్రభువులను గూర్చియేమో చెప్పాడు. రామశాస్తులుగారికి విస్మృతి వచ్చినట్టుంది.

నానామంత్రి : తల్లితండ్రులు ప్రభువులను దిద్దాలి. మాబోటి అధికార్లను ప్రభువులు దీద్దాలి; గాని తిట్టి బతకనేర్చిన కడుపుకూటి బ్రాహ్మడా, మహప్రభో తప్పొప్పులు కనిపెట్టే వాడూ? కొందరు మహానుభావులు యతగాడికి విందులు పెట్టి, వారి పగలు ఈ వికటకవి ద్వారా తీర్చుకుంటారు. అయినా, నౌకరుకు విచారం లేదు. ప్రభుసేవా దైవసేవలతో కాలం వెళ్ళపుచ్చే మనిషి, దూషణ భూషణ తిరస్కారములు సరకు గొనడు. మనవి చెయ్యవలశిన మాట ఒకటి వుండి పోయింది మహప్రభో! మాతా మహారాణీవారి శలవైనది. మహారాజ కుమారికా వారికి విద్యాభ్యాసము ముగించ వలసిన కాలము మీరినదని వారి అభిప్రాయము.

కర్ణమహారాజు : అమ్మాజీవారి ఆజ్ఞ మన అందరికీ సిరస్సున ధార్యము.

కృష్ణస్వామి : (విదూషకునితో) ఏమి వెన్నుకుప్ప పరిసీలిస్తున్నావు?

విదూ : ఈ దొడ్డ సలహా, మాతా మహారాణీ వారికి, యెవరు మనవి చేసి యుందురో అని.

కర్ణమహారాజు : వెన్నుకుప్ప చెప్పునా?

నానామంత్రి : నేను మనవి చేశానని కాబోలు, యీ బ్రాహ్మడి మాటల ధ్వని. శ్రీకృష్ణులు సాక్షి నేను మనవి చెయ్యలేదు.

కర్ణమహారాజు : యెన్నడూ వొట్టు వేసుకోకండి. వొట్టు వేసుకోవడం యితరులు మనమాట నమ్మరని కదా? నమ్మినా, నమ్మకపోయినా, వొట్టు కార్యము లేదు కదా?

రామశాస్త్రి : సలహా మాటకు వస్తే, ఈ విషయములో ఒకరి సలహాకు యేమి అవకాశం కద్దు? మహారాజకుమారికా వారికి విద్యాభ్యాసపుటీడు మీరినదని, ఒకరు విన్నవించిన గానీ, మాతా మహారాణీ వారికి తెలియదు కాబోలును.

విదూ : కొందరు అధికార్లకు ఆశ్రయణమూ, పొగడ్తా రుచి. బిల్హణుడు ఉద్యోగస్తులకు కైవారం చెయ్యడు. వారి నోట వచ్చిన మాట కల్లా అహ! హా! అని ఆశ్చర్యం నటించడు. వొచ్చిన ఉపద్రం, యిది.

గురుజాడలు

433

బిల్హణీయము