పుట:Gurujadalu.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ : కృతజ్ఞుడనై వున్నాను! మధు : ఆ పుస్తకము నేను చూడవచ్చునా అండి? సౌజ : చూడు. (మధురవాణి పుస్తకము విప్పి చదువును.) మధు : భగవద్గీతలు, యిది మంచివారు చదివే పుస్తకమా అండి? సౌజ : యిది చెడ్డవారిని మంచివారినిగా చేశే పుస్తకం. మధు : దానిలో యేముందండి? సౌజ : అది చదివిన వారికల్లా విలవలేని గొప్ప స్నేహితుడొకడు దొరుకుతాడు. మధు : యెవరండి ఆ స్నేహితులు? సౌజ : శ్రీకృష్ణుడు. మధు : శ్రీకృష్ణుడు సానిదానితో కూడా స్నేహం కడతాడా అండి? సౌజ : శ్రీకృష్ణుడు తన్ను నమ్మినవారితో అల్లా స్నేహం కడతాడు. పరమాత్మకు జాతి భేదం లేదు. మధు : శ్రీకృష్ణుడు ఆంటీనాచి కాడా అండి. సౌజ : యేమి పెంకెవు! మధు : అయితే ఈ పుస్తకం చదువుతాను. చదివి మంచిదానను అవుతాను. సౌజ : కావలిస్తే ఆ పుస్తకం తీసుకువెళ్లు. మధు : కృతార్థురాలను - శలవా? సౌజ : (వెన్నుకుప్ప వేపు చూచి యోచించి) నువ్వు మంచిదానివి. యెవరో కాలుజారిన సత్పురుషుడి పిల్లవై వుంటావు. యీ వృత్తి మానలేవో? స్థితిలోపమా? మధు : దైవానుగ్రహం వల్ల లోపం లేదు. నా వృత్తి యొక్క హైన్యత గుర్తెరుగుదును. సత్పురుషుల దయ సంప్రాప్తమైన తరవాత దుర్వృత్తి యేల వుంటుంది? సౌజ : (భగవద్గీతా పుస్తకము మీద నున్న శ్రీకృష్ణుని విగ్రహమును వేలునజూపి) సత్పురుషుడనే నామము సార్థకముగాగల యీ సత్పురుషుణ్ణి నీకు యిచ్చాను. ఆయన స్నేహం బలమైనకొలదీ మా బోట్లను తలచవు. మధు : అప్పటప్పట తమదర్శనం చేసుకోవచ్చునా? గురుజాడలు 419 కన్యాశుల్కము - మలికూర్పు